Pinipe Viswarup(Photo-Twitter)

Kakinada, May 24: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా (Konaseema Protest) మారాయి. 144 సెక్షన్‌ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సులు దగ్ధం చేశారు.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్‌ (Minister Pinipe Viswarup) ఇంటికి నిప్పు పెట్టారు. దీనిపై మంత్రి విశ్వరూప్‌ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్‌ చేశాయి. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి' అని మంత్రి విశ్వరూప్‌ కోరారు.

ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్ తెలిపారు, మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి

కోనసీమ ఉద్రిక్తతలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తృతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అంబేడ్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

రెచ్చగొట్టడం ఎవరూ చేసినా తప్పే.. మా పార్టీకి వచ్చే ప్రయోజనం ఇందులో ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది అయితే కాదు. ఒక మహానేత పేరు పెడితే పునరాలోచించాలిల్సిన అవసరం ఏముంది. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతాము. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.