Amaravati, May 24: ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్ ఉదయ్ భాస్కర్) కేసు విషయంలో ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డి (AP Govt Advisor Sajjala Ramakrishna Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసు విషయంలో మేం నిష్పక్షపాతంగా వ్యవహరించాం. సీఎం జగన్ ఎప్పుడూ న్యాయం వైపే నిలిచారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని అన్నారు.
ఆధారాలు ఉంటే మా పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం చెప్పారు. ఈ కేసులో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించారు. ఎమ్మెల్సీ కేసు విషయంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఏరోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా?. ఎమ్మార్వో వనజాక్షి ఘటనను ఎవరూ మరచిపోలేదు. ఆరోజు ఎమ్మార్వోపై దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై వార్తలు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోందని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.