Anandayya Corona Medicine: కృష్ణపట్నం మందుపై కొనసాగుతున్న సస్పెన్స్, అజ్ఞాతంలోకి వెళ్లిన ఆనందయ్య, నెల్లూరు కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్, సోమవారం విచారణ, మందుపై కేంద్ర అధ్యయన సంస్థ నివేదిక నేడు వచ్చే అవకాశం
మళ్లీ పోలీసులు రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. కాగా కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను (Anandayya) రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది.
Nellore, May 29: దాదాపు వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్న ఆనందయ్యను.. మళ్లీ పోలీసులు రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. కాగా కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను (Anandayya) రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై (Anandayya Corona Medicine) హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు.
శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు.కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు.
అన్నీ అనుకూలిస్తే ఆనందయ్య కరోనా మందు టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం
కృష్ణపట్నంలో 144 సెక్షన్ : మరో వైపు మందు కోసం కృష్ణపట్నానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ (Anandayya Ayurvedic medicine Distribution) నిలిపివేయడంతో ఆనందయ్య కోసం వస్తున్న వారికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. ఔషధంపై సోమవారం నివేదిక రానుండగా.. అప్పటి వరకు రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కృష్ణపట్నంలోకి పోలీసులు అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా.. విజయవాడ పరిశోధన కేంద్రం ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌కు సానుకూలంగా నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదు: ఇదిలా ఉంటే కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజంలేదని ఆయన పేర్కొన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధంగా లేవని చెప్పారు.వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావద్దని కోరారు.
ఎలాంటి హానికర పదార్ధాలు లేవు: ఇదిలాఉండగా ఆనందయ్య ఇస్తున్న మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని ఆయూష్ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో అనుమతి ఎప్పుడు వస్తుందా అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆనందయ్య మందుపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే.
జగపతి బాబు రియాక్ట్ : టాలీవుడ్ నటుడు జగపతి బాబు రియాక్ట్ అవుతూ ఆనందయ్య నాటు మందుపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. ''తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మనల్ని కాపాడేందుకు ప్రకృతి ముందుకొచ్చినట్లు అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. అతన్ని దేవుడు ఆశీర్వదించాలి'' అని ఆయన పేర్కొన్నారు.
హీరో బాలకృష్ణ : ఆనందయ్య కరోనా మందుపై తనకు నమ్మకం ఉందని హీరో బాలకృష్ణ తెలిపారు. అభిమానం లేనిదే ఆరాధన లేదని, ఆరాధన లేనిదే మతం లేదన్నారు. మతం లేనిదే మానవుడే లేడన్నారు. అలాగే ప్రతీది ఒక నమ్మకం..ఆయుర్వేదాన్ని తాను తప్పకుండా నమ్ముతానని చెప్పారు. ” మన దేశంలో గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడనే వైద్యుడుండే వాడు. ఆ కాలంలోనే ఆయన ఓ గొప్ప సర్జన్. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ఇప్పటికీ ఆయన పేరు రాసుంటుంది. అలాంటి గొప్పవారిని మనం మరిచిపోయాం” అని బాలయ్య వ్యాఖ్యానించారు.
ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ : తాజాగా ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం.. ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఆనందయ్య తన మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని కూడా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో తెలియ జేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని.. లిఖిత పూర్వకంగా ఇది ఇంకా స్పష్టం కాలేదని కూడా హైకోర్టు తెలిపింది.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా : మరోవైపు దీనిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఆనందయ్య ఔషధంపై జరుగుతున్న అధ్యయనం వివరాలను ఆయన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవను అడిగి తెలుసుకున్నారు. తొలుత కిరణ్ రిజిజుకు ఫోన్ చేసిన ఆయన... వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తిచేయాలని సూచించారు. అందుకు కిరణ్ రిజిజు బదులిస్తూ... మంత్రాలయంలోని ఆయుష్ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని వెంకయ్యనాయుడికి తెలిపారు.
ఆనందయ్య మందు ఐసీఎంఆర్ పరిధిలోకి రాదని, ఆయుష్ శాఖకు సంబంధించిన అంశం అని బలరాం భార్గవ ఉపరాష్ట్రపతికి వివరించారు. ఇప్పటికే ఆయుష్ శాఖ అధ్యయనం చేస్తున్నందున, ప్రత్యేకంగా ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేయాల్సినంత ఆవశ్యకత లేదని తెలిపారు.