Anandaiah Corona Medicine: ప్రతి ఇంటికి ఆనందయ్య కరోనా మందు, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం, లేనిపోని ఆరోపణలు చేయవద్దు, మీడియాతో వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి
YSRCP MLA Kakani Govardhan Reddy (Photo-Video Grab)

Nellore, May 23: ప్రభుత్వం అనుమతి వచ్చాకే ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ (Anandaiah Corona Medicine) చేస్తామని సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఈ లోపు లేనిపోని ఆరోపణలు చేసి, మందుపై అనుమానాలు రేపొద్దని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే (YSRCP MLA Kakani Govardhan Reddy) అన్నారు.

ఆదివారం ఆయన ఆనందయ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందుపై (krishnapatnam Ayurvedic Medicine) ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. త్వరలోనే అనుమానాలు నివృత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి రాద్దాంతం చేయొద్దని తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఆయుర్వేద మందు కోసం జనాలు గుంపులుగా కృష్ణపట్నం (krishnapatnam) గ్రామానికి తరలిరావడం క్షేమం కాదన్నారు.

నెల్లూరు జిల్లా ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారుల నివేదిక అందించిన వెంటనే జిల్లాలో అవసరమైన ప్రతి ఇంటికి ఆయుర్వేద మందు చేర్పించే బాధ్యత నాది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులు ఎవ్వరూ ఈ ప్రాంతానికి తరలి రావాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తాం. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న వ్యక్తులకు సొంత ఖర్చులతో కొరియర్ సర్వీస్ ద్వారా మందు అందజేస్తాం.

ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్, కృష్ణపట్నంకు ఎవరూ రావొద్దని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఆదేశాలు, ఆనందయ్య ఇస్తున్న కోవిడ్ ఔషధంపై పరిశీలన చేస్తున్న ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు

జిల్లాలో ప్రధాన ప్రాంతాలతో పాటు, మండల స్థాయిలో కూడా ఆయుర్వేద మందు పంపిణీని చేపడుతాం. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన తరుణంలో కొంత మంది చేసే రెచ్చగొట్టే ప్రకటనలు గమనించి, రెండు రోజులు ఆలస్యమైన ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రజలకు త్వరితగతిన ఆయుర్వేద మందులు అందించేందుకు ఆయుష్, ఐసీఎంఆర్ అధికారుల ద్వారా శీఘ్రంగా నివేదిక అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.’’ అని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బృందాన్ని పంపించడం మందు పంపిణీ పట్ల ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం సంబంధిత కేంద్ర మంత్రి, అధికారులు, ఐసీఎంఆర్ సభ్యులతో మాట్లాడి వీలైనంత త్వరగా నివేదిక సిద్ధం చేయించి, మందు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు, 24 గంటల్లో 3,741 మంది మృతి, తాజాగా 2,40,842 మందికి పాజిటివ్‌, ఉత్తరాఖండ్‌లో చిన్నారులపై భీకర దాడి చేస్తోన్న కరోనా

తమ మందుపై నిన్న అధ్యయనం చేశారని ఆనందయ్య తెలిపారు. ఐసీఎంఆర్‌ బృందం కూడా అధ్యయనం చేయడానికి వస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశామని ఆయన పేర్కొన్నారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం ఏది చెప్తే.. అది చేస్తామని ఆనందయ్య తెలిపారు.

శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ

ఇదిలా ఉంటే శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందును ఆయుర్వేద ఫార్మసీ నిపుణులు పరిశీలించారని.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే మందు తయారీకి సిద్ధమవుతామని తెలిపారు. ఆనందయ్య వాడే వనమూలికలు శేషాచల అడవుల్లో సంవృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాకే విస్తృతంగా మందు తయారీకి చర్యలు చేపడతామని చెవిరెడ్డి పేర్కొన్నారు.

ఆయుర్వేద మందు వినియోగంలో కోవిడ్ వ్యాధికి ఉపశమనంతో పాటు, ఇతరాత్రా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయో, తేల్చడానికి ఐసీఎంఆర్ బృందం, ఆయుష్ అధికారులు, ఆయుర్వేద మందును పరిశీలనకు ప్రభుత్వం పంపించింది. కరోనా నివారణతో పాటు, కరోనా మందు తీసుకున్న వారికి ఎటువంటి ఇతర ఇబ్బందులు కలగకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆయుర్వేద వైద్యంపై అధ్యయనం చేయిస్తుంది.

నాటు మందుగా పరిగణిస్తాం: ఆయుష్‌ కమిషనర్‌ రాములు

ఆనందయ్య చేస్తున్న కరోనా మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ లేవని అధ్యయనం చేస్తున్న ఆయుష్‌ కమిషనర్‌ రాములు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా కాకుండా నాటు మందుగా పరిగణిస్తామని రాములు తెలిపారు. మందు తయారీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం.

మందు తయారీలో ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవని పేర్కొన్నారు. అలాగే ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కాదని కూడా తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్ధాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. కాకపోతే ఈ మందును అనేక ఆరోగ్య సమస్యల కోసం తయారు చేశానని ఆనందయ్య చెప్పారు. కరోనా కోసం తయారు చేశానని చెప్పలేదని' వెల్లడించారు. త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాములు తెలిపారు.