Nellore, May 22: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం (krishnapatnam Ayurvedic Medicine) అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న సంగతి విదితమే. ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై సీఎం జగన్ ( chief minister Y S Jagan Mohan Reddy) కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి (krishnapatnam ayurvedic medicine distribution) వారం పాటు బ్రేక్ పడింది. నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.
మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ (Ayush) అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ (ICMR) శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి (Anandaiah Coronavirus Medicine) అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
Here's Nellore Collector Update
#Nellore Collector: Distribution of herbal medicine stopped. DMHO, Ayush officials have sent samples of drug to a lab in Hyderabad. Roping in ICMR to investigate. Depending on the findings, the individual can apply for permission to sell. No supply allowed until then. pic.twitter.com/fEgsgWY1lA
— krishnamurthy (@krishna0302) May 21, 2021
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మందు (Krishnapatnam Corona medicine) తయారీ, పంపిణీ ఆలస్యం అవుతుందని, ఇతర ప్రాంతాల నుంచి ప్రజల ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మందు పంపిణీకి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లా అధికారులు తెలియజేస్తారన్నారు. ఈ మధ్యలో మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నంకు వచ్చి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య (B Anandaiah) ఇస్తున్న కరోనా ఔషధంపై పరిశీలన చేపట్టేందుకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంది. ఆనందయ్య ఔషధం తయారీలో ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను ఐసీఎంఆర్ బృందంలోని సభ్యులు పరిశీలించారు. ఔషధ తయారీ విధానాన్ని ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే కోణంలో ఆరా తీశారు. కాగా, ఐసీఎంఆర్ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మి కూడా ఉన్నారు.
ఆనందయ్య అందిస్తున్న కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నారని ఏపీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఔషధంలోని మూలికలు, పదార్థాలతో దుష్ఫలితాలు కనిపించలేదని తెలిపారు.ఆనందయ్య కరోనా ఔషధాన్ని పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా వచ్చిన నేపథ్యంలో సింఘాల్ స్పందించారు. ఆనందయ్య కరోనా మందుపై శాస్త్రీయ అధ్యయనం చేపడుతున్నట్టు తెలిపారు. ఆనందయ్య ఔషధం వల్లే కరోనా తగ్గిందా? లేక, వైరస్ తీవ్రత నిదానించడం వల్లే కరోనా తగ్గిందా? అనే దానిపై అధ్యయనం ఉంటుందని వివరించారు.
సోమవారం నుంచి ఆయుర్వేద మందుపై శాస్త్రీయ పరిశీలన జరుగుతుందని చెప్పారు. కృష్ణపట్నంలోని కరోనా కేసుల సరళి పరిశీలించాలని అధికారులకు సూచించామని అన్నారు. కృష్ణపట్నంలో ఆయుష్ విభాగం అధికారులు పరిశీలించారని, మందు తయారీ విధానం, వాడినవారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సింఘాల్ వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర ఆయుష్ విభాగం ఉన్నతాధికారులతోనూ చర్చించామని పేర్కొన్నారు.
శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. నేడు రాములు ఎదుట ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారుచేసి చూపించనున్నారు అధ్యయనం పూర్తైతే ఆనందయ్యకు మందు పంపిణీకి అనుమతి వచ్చే అవకాశం ఉంది.
కాగా, కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు కోసం ప్రజలు కృష్ణపట్నం బాటపట్టారు. ఒక వైపు కరోనా వచ్చిన రోగులు, మరో వైపు కరోనా రాకుండా ఉండేందుకు మందు తీసుకునేందుకు వచ్చిన వేలాది మందితో కృష్ణపట్నం శుక్రవారం కిక్కిరిసింది. కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య ఇస్తున్న మందుతో కరోనా తగ్గిపోతుందనే నమ్మకంతో జనం కిలో మీటర్ల వరకు క్యూ కట్టారు. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు కృష్టపట్నంకు చేరుకున్నారు. జనాల రద్దీతో కిటకిటలాడింది.
Here's ANI Update
Andhra Pradesh | People in very large numbers gather at Krishnapatnam village in Nellore district where an Ayurvedic practitioner is distributing medicines for COVID19; social distancing norms flouted pic.twitter.com/plv60oxtXl
— ANI (@ANI) May 21, 2021
ఒక్కసారిగా జనాలు రావడంతో కృష్ణపట్నంకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మందు కోసం సీరియస్ కండీషన్‌లో ఉన్న కరోనా బాధితులను అంబులెన్స్‌ల్లో సైతం తీసుకువచ్చారు. మందు కోసం గురువారం రాత్రి నుంచే జనం అక్కడికి చేరుకుని గంటల కొద్దీ నిరీక్షించారు. అయితే తగినంత స్థాయిలో వనమూలికలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. కొన్ని రహదారుల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల్లో జనాలను రాకను కొంత వరకు నియంత్రించారు. అయితే ఆనందయ్య తయారు చేసే మందుకు ఇంత ప్రాధాన్యత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగం జరుగుతుందా అనే ఉద్దేశంతో ఆయుష్ శాఖను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
ఇదిలా ఉంటే కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా జబ్బుకు బాగా పని చేస్తోందని ప్రచారం రావడంతో ప్రజలతో పాటు బాధితులు నమ్మడంతో నెల్లూరు పెద్దాస్పత్రిలో శుక్రవారం ఒక్క సారిగా అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది. కిక్కిరిసి ఉండే క్యాజువాలిటీ ఖాళీ అయింది. ఖాళీ మంచాలు దర్శన మిచ్చాయి. పలువురు బాధితులు ప్రత్యేక వాహనాల్లో కృష్ణపట్నం మందుకు ఉరుకులు, పరుగులు తీశారు.
ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు కేవలం 40 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఈ 40 అడ్మిషన్లలో కూడా ఆక్సిజన్ పడిపోయిన వారు, ఐసీయూలో ఉండాల్సి వారే అధికం. వార్డుల్లో ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్న రోగుల బంధువులు పలువురు కృష్ణపట్నం నుంచి మందు తెచ్చి రోగులకు వినియోగించినట్టు సమాచారం. అయితే కృష్ణపట్నం పోయిన రోగులు మందులు తీసుకుని సాయంత్రానికి మళ్లీ కొంతమంది తిరిగి క్యాజువాలిటీకి రావడంతో కొంత హడావుడి కనిపించింది.