Krishnapatnam Anandaiah Medicine: అన్నీ అనుకూలిస్తే ఆనందయ్య కరోనా మందు టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం, నేడు సీసీఆర్‌ఏఎస్‌కు నివేదిక సమర్పించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ
ఈ కమిటీ 500 మంది నుంచి నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ నేడు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(CCRAS)కు నివేదిక సమర్పించనుంది.
Krishnapatnam, May 26: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 500 మంది నుంచి నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ నేడు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(CCRAS)కు నివేదిక సమర్పించనుంది. మరో రెండ్రోజుల్లో సీసీఆర్‌ఏఎస్ నుంచి నిర్ణయం వెలువడనుంది. అన్ని అనుకూలిస్తే ఈ నెలాఖరుకు ఆయుర్వేద మందును (Krishnapatnam Anandaiah Medicine) టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆనందయ్య కరోనాకు (anandaiah Corona medicine) ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే మందును స్వీకరించిన వ్యక్తుల అభిప్రాయాలు, వైద్య నివేదికలు సేకరించాలనుకున్న సీసీఆర్‌ఏఎస్ ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థతో పాటు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు అప్పగించింది. తొలిదశలో 500 మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ద్వారా ఔషధం పనితీరుపై ఓ అంచనాకు రావాలని భావించారు. ఈ రెండు సంస్థల సిబ్బంది తమకు అందిన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్ చేయడం ప్రారంభించారు.
జాబితాలోని 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. 42 మంది తాము అసలు మందు తీసుకోలేదని చెప్పారు. మరో 36 మంది ఒకే నంబరు ఇచ్చారు. ఔషధం తీసుకున్నట్లు చెబుతున్న వారిలోనూ అనేక మంది వైరస్ రాకుండా ముందుజాగ్రత్తగా వేసుకున్నామని తెలిపారు. మరికొందరు కొవిడ్ బారిన పడ్డ తర్వాతే తీసుకున్నామని చెప్పినా.. సంతృప్తికరంగా వివరాలు వెల్లడించలేదు’అని అధికారులు పేర్కొంటున్నారు.దీంతో ప్రభుత్వానికి ఎలా నివేదించాలంటూ ఆయుర్వేద సంస్థల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మరింతమంది ఫోన్ నంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను కోరారు. ఆనందయ్య దగ్గర సుమారు 70 వేల మంది ఔషధం తీసుకున్నట్లు పోలీసులు, నిఘా వర్గాల అంచనా. తన వద్దకు వచ్చిన వారి నుంచి ఆయన ఎలాంటి వివరాలు సేకరించలేదు. మరింత మందిని ఆరా తీస్తేగానీ ఓ స్పష్టత రాదని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇక ఆనందయ్య కొవిడ్‌కు ఇస్తున్న మందు పంపిణీపై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు రేపు (ఈ నెల 27న) విచారించనుంది.