CM KCR Nagarjuna Sagar Tour: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, నాగార్జున సాగర్‌లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి, నియోజక వర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడి
హాలియాలో నిర్వహించిన సభలో సాగర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు (150 crores sanctioned For Nagarjuna sagar) కేటాయిస్తున్నామని తెలిపారు.
Nagarjuna Sagar, August 2: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాగర్ నియోజకవర్గంలో (CM KCR Nagarjuna Sagar Tour) పర్యటించారు. హాలియాలో నిర్వహించిన సభలో సాగర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు (150 crores sanctioned For Nagarjuna sagar) కేటాయిస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల జిల్లా పర్యటనకు రావడం ఆలస్యమైంది. నేను కూడా కరోనా బారిన పడ్డా. సాగర్ నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. మౌలిక సదుపాయల సమస్యను పరిష్కరించాల్సిన ఉంది. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తాం.
నందికొండలో జాగాలున్నవారికి పట్టాలు మంజూరు చేస్తాం. హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించాను. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు ఇస్తా. సాగర్ నియోజకవర్గంలోని ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. హాలియాలో డిగ్రీ కాలేజ్, మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్ వరాలు కురిపించారు.
నెల రోజుల్లో హక్కు పట్టాలు ఇస్తామన్నారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాం. దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం.
జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు. దళితబంధు పథకంపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. 12లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం తప్పకుండా చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధు అమలు చేస్తాం. దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైందని’’ సీఎం కేసీఆర్ అన్నారు.
నోముల భగత్ అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంలో ఆయా నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి పని చేశారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ ఎమ్మెల్యేలు రిపోర్టు ఇచ్చారు. గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా సరిగా కల్వర్టులు లేవని చెప్పారు. హాస్పిటళ్ల పరిస్థితి కూడా బాగాలేదని చెప్పారు. హాలియా పట్టణాన్ని చూస్తేనే తమ సమస్య అర్థమవుతుందని చెప్పారు. హాలియాను అద్భుతంగా చేయాలి. ఇక్కడ రోడ్లు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. వాటన్నింటిని క్రమక్రమంగా పూర్తి చేసుకుందాం అని కేసీఆర్ అన్నారు.
దేవరకొండలో ఐదు లిఫ్టులు మంజూరు చేశాం. మిర్యాలగూడలో మరో ఐదు లిఫ్టులు, నకిరేకల్, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్ నల్గొండ జిల్లాలో మొత్తం 15 లిఫ్టులను మంజూరు చేశాం. ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేస్తాం. బంజారాల కోసం బంజారా భవనం నిర్మాస్తాం. దళితబంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం. 24 గంటల విద్యుత్ ఇస్తామంటే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారు. రెండేళ్లు కాదు ఇరవై ఏళ్లయినా ఇవ్వలేరని జానారెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తే టీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి అన్నారు. రెండేళ్లలో మేం 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. జానారెడ్డి మాత్రం మొన్న కాంగ్రెస్ కండువా కప్పుకునే పోటీ చేశారు’ అని కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు.
కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అవలంభించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా నదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు చాలా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. పెద్దదేవులపల్లి – పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.