NewDelhi, August 2: కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జలవివాదంపై (Krishna Water Dispute) తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI Ramana) వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం (Amicable Settlement) ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు.
మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ అంశంలో సహాయపడుతుందని వెల్లడించారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటే.. వేరే ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులకు సూచించారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న జస్టిస్ ఎన్.వి.రమణ (I Belong To Both States) ప్రభుత్వాలతో సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలని రెండు రాష్ట్రాల తరఫు న్యాయవాదులకు సూచిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. అంతేకాదు.. కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించానన్న విషయాన్ని కూడా సీజేఐ గుర్తు చేసుకున్నారు.
కాగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తెలంగాణ తరపున సిఎస్ వైద్యనాధన్ వాదనలు నేటి విచారణలో తమ వాదనలు వినిపించారు. కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
బోర్డు పరిధిని నిర్ణయిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినందున ఏపీ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని.. ఈలోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉన్నందున తక్షణం గెజిట్ అమలు చేయాలని ఏపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నాలుగు నెలలపాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నట్లు చెప్పారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించిన అనుభవం దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే విచారణ వాయిదా వేసి మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని చెప్పారు.