Sisters Gang Rape in HYD: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్,మత్తు మందు ఇచ్చి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం,ఇంకా కనిపించని అక్క అచూకి, గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు
గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం (Gang Rape in Hyderabad) చేశారు.
Hyderabad, August 17: తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో దారుణం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం (Gang Rape in Hyderabad) చేశారు.
తన తల్లి, పిన్ని కనిపించడం లేదంటూ బాధితురాలి కుమారుడు ఓ రేడియోగ్రాఫర్‌ను నిలదీయగా.. ఎక్కడున్నారో చూద్దామంటూ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి అంతా కలియ తిప్పాడు. ఓ చోట శరీరంపై అరకొర దుస్తులతో అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని కనిపించింది. సపర్యలు చేసి ఆమెను మహబూబ్‌నగర్‌కు తీసుకువెళ్లారు. జరిగిన దారుణాన్ని అక్కడ ఆమె వివరించింది. దాంతో సోమవారం స్థానిక పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వర్ ఆ మహిళలకు దూరపు బంధువు కావడంతో వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు (17) వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా విషయం వెలుగులోకి వచ్చింది.
ఉమామహేశ్వర్ ఈనెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం (Gang Rape in Gandhi Hospital) చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి (Gandhi Hospital staffer accused of raping two sisters) పాల్పడ్డారు.. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్‌తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి పంపించి ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వైద్యపరీక్షలకు పంపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉమామహేశ్వర్‌పై రేప్ కేసు నమోదు చేసి, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరికొంతమంది రేప్ చేసినట్టు బాధితురాలు చెప్పినందున వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే.. బాధితురాలి అక్క ఆచూకీ తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
బాధితురాలు విచారణకు సరిగా సహకరించట్లేదని.. ఈ కేసులో కొన్ని అనుమానాలున్నాయని.. తప్పిపోయిన మహిళ ఆచూకీ లభిస్తే మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఈ నెల 7 నుంచి 15వ తేదీ దాకా వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గత ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. ఒకవేళ వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
గాంధీ అత్యాచారం ఘటనకు సంబంధించి దర్యాప్తు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. గాంధీలో చికిత్స తీసుకున్న రోగి భార్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించడం కోసం ఆమెను భరోసా కేంద్రానికి పంపించామన్నారు. వివరాలు రాగానే దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామన్నారు. అత్యాచారం ఘటన గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే జరిగిందా లేదా బయట జరిగిందా అన్న విషయాలపై దర్మాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంవోలు, ఇతర వైద్యులతో విచారణకు ఆదేశించాం. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నాం. నిందితుడు, ఆ మహిళలు ఆస్పత్రిలో తిరిగిన దృశ్యాలు ఉంటే వాటిని పరిశీలిస్తాం. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరో తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.