Gandhi Hospital (Photo-Twitter)

Hyderabad, August 17: గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్లపై జరిగిన అత్యాచార ఘటనకు (Hyderabad Gang Rape Case) సంబంధించి నలుగురిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. బాధితురాలు చెబితే తప్ప అసలేం జరిగిందో వివరించలేం. బాధితురాలితో ఇవాళే మాట్లాడతా. పూర్తి విచారణ జరిగిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయి. మరో బాధితురాలు ఎక్కడ ఉందో గుర్తించలేదు. దోషులపై కఠిన చర్యలు ఉంటాయి. చికిత్స కోసం వచ్చిన రోగి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు’’ అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్,మత్తు మందు ఇచ్చి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం,ఇంకా కనిపించని అక్క అచూకి, గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు

గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు (Gandhi Hospital Gang Rape Case) సంబంధించి విచారణకు ఆదేశించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా. రాజారావు వెల్లడించారు. అత్యాచార ఆరోపణలపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాచారం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 189 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఆరోపణలు రుజువుకాకుండా అసత్య ప్రకారం చేయొద్దని కోరారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో భాజపా మహిళా మోర్చా నేతలు చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పీఎస్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా భాజపా మహిళా మోర్చా నేత గీత మూర్తి మాట్లాడారు. ఆస్పత్రిలో అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ లోపం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు.