G. O 111 Removed: హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్, 111 జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు, ఆంక్షలు ఎత్తివేస్తూ కొత్త జీవో జారీ, 84 గ్రామాల్లో వెల్లివిరిసిన ఆనందం
ఈ క్రమంలో 111 జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ జీవో నంబర్ 69ని పురపాలక శాఖ జారీ చేసింది.
Hyderabad, April 21: ఉస్మాన్‌సాగర్ (Usman sagar), హిమాయత్‌సాగర్ (Himayath sagar) జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధికి సంబంధించిన జీవో 111పై (G.O 111) గ్రీన్‌జోన్లను పరిరక్షిస్తూ, మాస్టర్ ప్లాన్‌ను అధ్యయనం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 111 జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ జీవో నంబర్ 69ని పురపాలక శాఖ జారీ చేసింది. విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల (Guidlines) కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గ్రీన్ జోన్లు (Green Zones) సహా జోన్ల నిర్ధారణ కోసం విధివిధానాలు, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. రోడ్లు (Roads), డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టాలని సూచించింది.
వసతుల కల్పన, నియంత్రిత అభివృద్ధి కోసం వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. లే అవుట్, భవన అనుమతుల కోసం నియంత్రణ చర్యలు తీసుకోవాలి. నియంత్రిత అభివృద్ధి సమర్థంగా జరిగేలా న్యాయపరమైన చర్యల్లో మార్పులు చేయాలని సూచించింది. జంట జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు, మౌలిక వసతుల కల్పన కోసం నిధుల సమీకరణకు మార్గాలను అన్వేషించాలని సూచించింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.