Chandrayaan-2: విక్రమ్ ల్యాండర్ ఇదిగో.. ఇక్కడే ల్యాండ్ అవుతూ క్రాష్ అయింది, శకలాలను కనిపెట్టిన నాసా, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది కూడా ఇండియన్ శాస్త్రవేత్తే..

చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లకు దానిని కనిపెట్టింది. విక్రమ్ శకలాలు మొత్తం 24 చోట్ల చిందరవందరగా పడినట్లు గుర్తించింది.

Nasa satellite finds debris of Chandrayaan-2 lander Vikram, releases pics NASA Credits Chennai Engineer (Photo-ANI)

New Delhi, December 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రయోగం చంద్రయాన్-2. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. భారత శాస్త్రవేత్తలు చివరి నిమిషం వరకు పోరాడి అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయినా ఆ ప్రయోగంతో ప్రపంచదేశాలను మనవైపు తిప్పుకునేలా చేశారు. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి చివరి నిమిషంలో హార్డ్ ల్యాండింగ్ (Hard Landing) ద్వారా కూలిపోయింది. చంద్రయాన్-3 వచ్చేస్తోంది

అప్పటి నుంచి  విక్రమ్ ల్యాండర్ (Vikram lander) జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రో, అటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA)లు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చంద్రుడిపై ఉన్న విక్రమ్ జాడను కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫొటోని షేర్ చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ విక్రమ్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపింది.  చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లకు దానిని కనిపెట్టింది. విక్రమ్ శకలాలు మొత్తం 24 చోట్ల చిందరవందరగా  పడినట్లు గుర్తించింది.

NASA Tweet

సెప్టెంబర్ 26వ తేదీన ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (ఎల్.ఆర్.ఓ) ల్యాండర్‌‌ను గుర్తించిందని నాసా పేర్కొంది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని నాసా తెలిపింది. ఈ విక్ర‌మ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ (Shanmuga Subramanian) గుర్తించిన‌ట్లు నాసా తెలిపింది.  చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో

ఎల్ఆర్‌వో తీసిన చిత్రాల‌ను ష‌ణ్ముగ స్ట‌డీ చేశారు. విక్ర‌మ్ గ‌తిత‌ప్పిన వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్ర‌మ్ శిథిలాలు క‌నిపించాయి. నాసా విడుదల చేసిన చిత్రాల్లో ఆకుపచ్చ రంగులో ఉన్న గుర్తులు విక్రమ్ శకలాలను సూచిస్తున్నాయి. తాజాగా న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌ను నాసా ఇంకా ప‌రిశీలిస్తోంది.

అయితే విక్ర‌మ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాల‌ను గుర్తించారు. ఫోటోల్లో ఆ శిథిలాల సైజు 2x2 పిక్సెల్స్‌గా ఉన్నాయి. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతానికి సంబంధించిన రెండు ఫోటోల‌ను నాసా అప్‌డేట్ చేసింది. విక్ర‌మ్ కూల‌క‌ముందు, కూలిన త‌ర్వాత.. చంద్రుడి ఉప‌రిత‌లంపై జ‌రిగిన మార్పుల‌ను ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జులైలో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ -2 ప్రయోగాన్ని చేపట్టింది. చైనా,  అమెరికా, రష్యా తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ (Chandrayaan-2's lander Vikram)పంపిన దేశం భారత్ కావడం విశేషం. చంద్రుడి దక్షిణ ధ్రువానికి ల్యాండర్‌ను పంపిన ఘనత కూడా భారత్ సాధించింది. చంద్రయాన్ -2 ఆర్బిటర్ పనిచేస్తున్నా, విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో అందులోని ప్రజ్ఞాన్ రోవర్ పని చేయడంలేదు.

వాస్త‌వానికి చంద్రుడి ద‌క్షిణ ధృవానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ల్యాండ‌ర్‌తో ఇస్రో సంకేతాల‌ను కోల్పోయింది. లూనార్ ఆర్బిటార్ సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఫ‌స్ట్ మొజాయిక్ ఫోటోను రిలీజ్ చేసింది. కానీ ఆ ఫోటోలో విక్ర‌మ్ ఆచూకీ చిక్క‌లేదు.

అయితే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న శాస్త్ర‌వేత్త ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు విక్ర‌మ్ కూలిన ప్రాంతం క‌నిపించింది. ఆ త‌ర్వాత ఎల్ఆర్‌వో టీమ్‌తో ష‌ణ్ముగ త‌న డేటాను షేర్ చేశాడు. దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్‌వో విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించింది.

అక్టోబ‌ర్ 14, 15, న‌వంబ‌ర్ 11 తేదీల్లో తీసిన ఫోటోల‌ను నాసా ఇమేజ్ సీక్వెన్స్ చేసింది. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌తో బెస్ట్ పిక్సెల్ క్లారిటీ వ‌చ్చింది. దీంతో విక్ర‌మ్‌ను గుర్తించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. కాగా ప్రస్తుతం చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్... చందమామ చుట్టూ బ్రహ్మాండంగా తిరుగుతోంది.