Happy Birthday Mahesh Babu: మహేష్ బాబు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్, రాజకుమారుడికి ఇప్పటికీ తెలుగు పూర్తిగా చదవడం రాదట, దర్శకుడు చెప్పే డైలాగ్స్ విని పర్ఫెక్ట్‌గా చెప్పేస్తాడట, మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం
తెరపై మిల్క్ బాయ్‌గా పిలిపించుకుంటూ నిజ జీవితంలో రాజకుమారుడిలా వెలుగొందుతున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు ఆ తర్వాత తనదైన నటనతో తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా మారాడు. తెరపై మిల్క్ బాయ్‌గా పిలిపించుకుంటూ నిజ జీవితంలో రాజకుమారుడిలా వెలుగొందుతున్నాడు. పెద్ద స్టార్ అయినప్పటికీ పలు సినీ కార్యక్రమాల్లో, ఇంటర్వ్యూలలో తక్కువ మాట్లాడుతూ ఒదిగిపోయే తత్త్వంలో అభిమానుల గుండెల్లో ఓ ‘మహర్షి’లా నిలిచిపోయాడు. మహేష్ బాబు పుట్టిన రోజు (Happy birthday Mahesh Babu) సంధర్భంగా ఆయన సినిమాలపై ప్రత్యేక కథనం.
ఆగష్టు 9, 1975న జన్మించిన మహేష్ బాబు (Mahesh Babu) తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థిరపడ్డారు. నటశేఖరుడు కృష్ణ (Krishna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘రాజకుమారుడు చిత్రంతో హీరో అయ్యాడు.అంతక ముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా కృష్ణతో కలిసి నీడ సినిమాలో కలిసి పని చేశారు. 1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పోరాటం’ సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించి మెప్పించాడు. ఆ తరువాత వరుసగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’ చిత్రాలతో బాల నటుడిగా మహేష్ మెప్పించాడు. బాలనటుడిగా నటించినా చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. అందుకనే తండ్రి మాటకు గౌరవమిచ్చి సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన హీరోగానే ఎంట్రీ ఇచ్చారు.
ఇక 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ ప్రొడ్యూసర్ సి.అశ్వినీదత్ నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో లవర్‌బోయ్‌గా, తండ్రి ఆశయ సాధనకు పాటుపడే కొడుకు పాత్రలో నటించి మెప్పించడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్‌ను సాధించారు. అలాగే ఈ సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డును కూడా మహేశ్ సొంతం చేసుకున్నారు.
తర్వాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాతగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన మహేశ్ రెండో చిత్రంగా సరికొత్త లవ్‌స్టోరితో రూపొందిన ‘యువరాజు’తో మరో సూపర్‌హిట్‌ను సాధించారు. మూడో చిత్రం ‘వంశీ’లో సూపర్‌స్టార్ కృష్ణతో పోటీపడి నటించారు. ఆ సినిమాలో నమ్రత శిరోద్కర్‌తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్‌తో చేసిన ‘మురారి’ చిత్రం మహేశ్‌ను అద్భుతమైన నటనకు ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమాకు మహేశ్ మరోసారి స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నంది అవార్డును దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘టక్కరి దొంగలో కౌబాయ్ గా మెప్పించారు.
దర్శకుడు శోభన్‌తో ‘బాబీ’ ఆ తర్వాత ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాదు.. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమా విజయం తర్వాత నిజం ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డును మహేశ్ బాబు సొంతం చేసుకున్నారు. అనంతరం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో అమ్మ పేరు మీద పెట్టిన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మంజుల సంజయ్ నిర్మాతలుగ ‘నాని’తో మహేశ్ మరో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. దీంతో పాటు నాన్న కృష్ణ పేరు మీద పెట్టిన కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేశ్ బాబు నిర్మాతగా అర్జున్ మూవీ చేశారు. ఈ సినిమాకు కూడా మహేశ్ నంది అవార్డును దక్కించుకున్నారు.
ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో డి.కిషోర్, ఎం.రామ్మోహన్ నిర్మాతలుగా చేసిన ‘అతడు చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటింది. ఆయన కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. దాని తర్వాత డాషింగ్ హీరో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’తో సూపర్‌స్టార్ మహేశ్‌గా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. తర్వాత ‘సైనికుడు’ అనంతరం రమేశ్‌బాబు నిర్మాతగా రూపొందిన ‘అతిథి’ చిత్రం చేశారు.
మళ్లీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘ఖలేజా’తో కామెడీ యాంగిల్ తో ప్రయోగం చేశారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు ఇండస్ట్రీని షేక్ చేసింది. అనంతరం రెండోసారి డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో చేసిన ‘బిజినెస్‌మేన్’ మహేశ్‌లోని హీరోయిజంను తెరపైన ఆవిష్కరించింది. దాని తర్వాత సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ చిత్రాలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
తర్వాత టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో చేసిన ‘వన్ నేనొక్కడినే, ఆగడు’ వంటి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలు చేశారు. అయితే ఇవి అంతగా అభిమానులను ఆకట్టుకోకపోవడంతో కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమా తెలుగు ఇండస్ట్రీలో దుమ్ము రేపింది. ఆ తర్వాత కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలు ఆధారంగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేసిన డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా చేసిన ‘స్పైడర్’ చిత్రాలు ఎక్ప్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయాయి. ఇక మళ్లీ కొరటాలతో జట్టుకట్టాడు. మహేశ్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో మళ్లీ పుంజుకున్నారు.
దాని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’తోమరోసారి ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఈ ఏడాది సంక్రాంతికి కమర్షియల్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిందని నిర్మాతలు చెబుతుంటారు. ఇక మహేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై వీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికి హీరోగా 26 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను అందుకున్నాడు. అయితే మహేష్ గురించి తెలియని ఆసక్తికర విషయాలలో ముఖ్యమైనది ఏంటంటే..మహేష్‌కి ఇప్పుడు తెలుగు చదవడం రాదు. అతను చెన్నైలో పుట్టి పెరిగాడు. దీంతో తెలుగు భాష నేర్చుకోవడానికి అవకాశం లేదు. అతను తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు, కానీ చదవలేడు. అతను దర్శకులు చెప్పిన డైలాగ్స్ విని సినిమాలో చెబుతుంటాడు.
మహేష్ బాబు చెన్నైలోని సెయింట్‌బెడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. తమిళ సూపర్‌స్టార్ సూర్య సోదరుడు తమిళ నటుడు కార్తీ కూడా అదే పాఠశాలలో చదువుకున్నారు. సామాజిక సేవ కూడా మహేష్‌లో చాలా ఎక్కువే. ఇతను తన సంపాదనలో 30 శాతం స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తాడు. మహేష్ ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం అనే రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పర్సనల్ విషయానిక వస్తే 2005లో నమ్రతని ప్రేమ వివాహం చేసుకున్న మహేష్.. గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారాడు. నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ ఇంకా నవ యువకుడిలానే కనిపిస్తున్నాడు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్ బో ఆస్పత్రితో కలిసి ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకుంటున్నారు. ఆర్ధికంగా బలంగా లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ గొప్ప మనసున్న ‘అతిథి’గా మహేశ్ అందరిచేత కీర్తించబడుతున్నాడు. క్టిష్ట పరిస్థితిల్లో ప్రభుత్వాలకు అండగా ఉంటున్నాడు. హుదుద్ తుపాను సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా రూ.2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ.25 లక్షలు అందజేశారు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు.