Telangana Police, Mahesh Babu (Photo Credits: Twitter)

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ ను పటిష్ఠంగా అమలుపరుస్తూ అవిశ్రాంతంగా సేవలందిస్తున్న పోలీసులను ఉద్దేశించి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. కోవిడ్-19 పై చేస్తున్న పోరాటంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న తెలంగాణ పోలీసుల కృషిని ఆయన అభినందించారు. పోలీసులు పడుతున్న శ్రమ నిజంగా అసాధారణమైనదని మహేశ్ అన్నారు.

" ఇంతటి కఠిన సమయాల్లో మా ప్రాణాలను, మా కుటుంబాల ఆరోగ్యాన్ని మా కాపాడుతున్న తెలంగాణ పోలీసులకు అపారమైన కృతజ్ఞతలు. ఈ దేశం పట్ల, దేశంలోని ప్రజల పట్ల మీరు ప్రదర్శిస్తున్న నిస్వార్థమైన అంకితభావానికి నా సెల్యూట్" #TelanganaPolice #StayHomeStaySafe అంటూ మహేశ్ ట్వీట్ చేశారు.

Mahesh Babu's Tweet For Telangana Police

ఇదిలా ఉంటే, మహేశ్ బాబు ఇప్పటివకు పోకిరి, దూకుడు, ఆగడు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించారు. తన ప్రతీ సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటున్న సూపర్ స్టార్ చివరగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఒక ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించారు. అయితే తన తర్వాత సినిమా ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని మహేశ్, వంశీ పైడిపల్లి లేదా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారని టాలీవుడ్ టాక్.