Pornography Law in India: పోర్న్ వీడియోలు చూసినా, షేర్ చేసినా నేరం కిందకు వస్తుందా, భారత్ చట్టాలు ఏమి చెబుతున్నాయి, చైల్డ్ పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు ?
పోర్న్ చూడడం, షేర్ చేయడం... ఇంకా చిన్న పిల్లల పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎటువంటి శిక్షలు వేస్తారు. ఇండియా చట్టాలు ఏం చెబుతున్నాయి.. ఈ చట్టాలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు, కోర్టులు ఏమి చెబుతున్నాయి ఓ సారి చూద్దాం.
New Delhi, Oct 20: దేశంలో పోర్న్ వీక్షించే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోందని సర్వేలు చెబుతున్నాయి. పోర్న్ సంబంధిత నివేదికలు వచ్చినప్పుడల్లా భారత్ టాప్ 5 స్థానాల్లో ఒకదానిని ఆక్రమిస్తోంది. ఇక కరోనా వైరస్ వచ్చిన తరువాత కేంద్రం విధించిన లాక్ డౌన్ తో దేశంలో పోర్న్ చూసే వారి సంఖ్య మరీ ఎక్కువయింది. ఈ నేపథ్యంలో పోర్న్ చూడడం, షేర్ చేయడం... ఇంకా చిన్న పిల్లల పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎటువంటి శిక్షలు వేస్తారు. ఇండియా చట్టాలు ఏం చెబుతున్నాయి.. ఈ చట్టాలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు, కోర్టులు ఏమి చెబుతున్నాయి ఓ సారి చూద్దాం.
భారతదేశంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం 2000, ఇండియన్ పీనల్ కోడ్ (IPC), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం 2012 యొక్క నిబంధనలు అశ్లీలత గురించి వివరిస్తాయి. భారతదేశంలో, ప్రైవేట్ ప్రదేశాలలో అంటే అతని సొంత రూంలో లైంగిక, అసభ్యకరమైన వీడియోలను చూడటం చట్టవిరుద్ధం కాదు. అది సదరు వ్యక్తి 'వ్యక్తిగత స్వేచ్ఛ' పరిధిలోకి వస్తుంది’’. ఈ మేరకు సుప్రీం కోర్టు జూలై 2015 లో తెలిపింది.ఇక వ్యక్తిగత స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛపై ఏమైనా ఆంక్షలు విధించాలని భావిస్తే, కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకురావచ్చని రాజ్యాంగం చెబుతోంది. ఇలా ఆంక్షలు విధించేందుకు సూచించిన షరతుల్లో ‘‘మొరాలిటీ, డీసెన్సీ’’ కూడా ఉంది.
ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛ సంపూర్ణ హక్కు కాదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలపై ట్విట్టర్‌లో సునయన హోలే అనే మహిళ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయగా.. ముంబయి పాల్ఘర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆ మహిళ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. బాంబే హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. సునయన హోలేపై ఐసీపీ సెక్షన్ 153, 505(2)ల కింద కేసులు నమోదుచేశారు. తాను ఎటువంటి నేరానికి పాల్పడలేదని, రాజ్యాంగంలోని భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకున్నానని వాదించింది. కానీ, ఆర్టికల్ 19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ, వ్యక్తీకరణ హక్కు సంపూర్ణంగా లేదని ధర్మాసనం గుర్తు చేసింది.
పోర్న్ వెబ్‌సైట్లు "నైతికత, మర్యాద" ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం యొక్క టెలికమ్యూనికేషన్ల విభాగం 2015 జూలైలో ఒక ఉత్తర్వు జారీ చేసింది. మొరాలిటీ, డీసెన్సీ’’ కిందే టెలికమ్యూనికేషన్ల విభాగం ఆంక్షలు విధించింది. అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించాలని ఇండోర్‌కు చెందిన న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. అయితే, కొన్ని రోజుల తరువాత ఈ ఆంక్షలను బాలల అశ్లీల దృశ్యాల(చైల్డ్ పోర్నోగ్రఫీ)ను కట్టడి చేసేందుకు తీసుకొచ్చామని టెలికమ్యూనికేషన్ల విభాగం తెలిపింది.
ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించే పోర్న్ నియంత్రణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – (ఐటీ యాక్ట్) 2020లో నిబంధనలు ఉన్నాయి. పోర్న్ సమాచారాన్ని పబ్లిష్ చేసినా, ట్రాన్స్‌మిట్ చేసినా నేరంగా పరిగణించేలా ఈ నిబంధనలను సిద్ధంచేశారు. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67A ప్రకారం.. శృంగార చర్యలను రికార్డుచేసి ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేసినా, ట్రాన్స్‌మిట్ చేసినా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల వరకు ఫైన్ కూడా విధించే అవకాశముంది. రెండోసారి కూడా పట్టుబడితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
అదే సమయంలో, సెక్షన్ 66-ఇ ప్రకారం, వ్యక్తి అనుమతి లేకుండా ఆమె లేదా అతడి ప్రైవేటు భాగాల ఫోటోలు, వీడియోలను ‘‘ఉద్దేశ పూర్వకంగా, లేకుండా’’ గానీ పబ్లిష్ చేసినా లేదా ట్రాన్స్‌మిట్ చేసినా గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ (ప్రొహిబిషన్) చట్టం-1986 కూడా ప్రచురణలు, వ్యాసాలు, పెయింటింగ్‌ల, దృశ్యాల కోసం మహిళల్ని అభ్యంతరకరంగా చూపించడాన్ని నేరంగా పరిగణిస్తోంది.
IPC లోని సెక్షన్ 293 ప్రకారం 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా పోర్న్ సంబంధింత వీడియోలు, చిత్రాలు అమ్మడం తీవ్ర నేరంగా పరిగణిస్తోంది. సెక్షన్ 294 ఏదైనా బహిరంగ ప్రదేశంలో అసభ్యకరమైన చర్యలు చేయడం లేదా అసభ్యకరమైన పాటలు పాడటం నేరంగా పరిగణించబడుతుంది. 2013 లో IPC కి చేసిన అనేక సవరణలు సమ్మతి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తున్నాయి.
ఉదాహరణకు, సెక్షన్ 354A లైంగిక వేధింపులను "ఒక మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా అశ్లీలత చూపించడం" నేరంగా పరిగణిస్తారు. మహిళల అసభ్య ప్రాతినిధ్యం (ప్రొహిబిషన్) చట్టం 1986 కూడా "ప్రకటనల ద్వారా లేదా ప్రచురణలు, రచనలు, పెయింటింగ్‌లు, బొమ్మలు లేదా మరేదైనా పద్ధతిలో మహిళల పట్ల అసభ్యకరమైన ప్రాతినిధ్యం" ని నిషేధిస్తుంది.
చైల్డ్ పోర్నోగ్రఫీ చట్ట వ్యతిరేకమని భారత ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టంచేసింది. బాలల అశ్లీల దృశ్యాలను అడ్డుకోవడానికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫమ్ సెక్షువల్ అఫెన్సెస్ (పోక్సో)లో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పిల్లల్ని లైంగిక కోణంలో చూపించే ఫోటోలు, వీడియోలు, కంప్యూటర్‌లో రూపొందించిన, మార్పులుచేసిన ఇమేజెస్ కూడా బాలల అశ్లీల సమాచారం కిందకే వస్తుందని దీనిలో కేంద్ర స్పష్టీకరించింది. ఇవి మీ దగ్గర ఉంటే కేసులను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లే..
అశ్లీల సమాచారం కోసం పిల్లల్ని ఉపయోగించుకుంటే ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చని పోక్సో చట్టంలోని సెక్షన్ 14 చెబుతోంది. రెండోసారి కూడా ఈ చట్టం కింద నేరం రుజువైతే ఈ శిక్షను ఏడేళ్లకు పెంచుతారు. జరిమానా దీనికి అదనంగా విధిస్తారు. వేరే వారికి పంపడానికి, షేర్ చేయడానికి లేదా చూడటానికి, పబ్లిష్ చేయడానికి పిల్లల అశ్లీల దృశ్యాలను మన దగ్గర దాచుకున్నా కూడా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. దీనికి జరిమానాలతోపాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశముంది. రూ. 5000ల నుంచి మొదలయ్యే ఈ జరిమానాలకు గరిష్ఠ పరిమితి అంటూ ఏమీలేదు. అంటే నేరం తీవ్రత ఆధారంగా ఈ జరిమానాలు ఉంటాయి.
ముఖ్యంగా వెబ్‌సైట్లలో పెట్టేందుకు ఈ దృశ్యాలు, ఫోటోలను సేకరిస్తే, మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. బాలల అశ్లీల దృశ్యాల విషయంలో కలెక్టింగ్, బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్, ప్రమోటింగ్, డిస్ట్రిబ్యూటింగ్‌లపైనా నిషేధం అమలులో ఉంది. అయితే, అధికారులకు సాక్ష్యంగా చూపించేందుకు ఈ దృశ్యాలను మన దగ్గర ఉంచుకోవచ్చు. భారత్‌లో పోర్న్ చూడటంపై నిషేధం లేనప్పటికీ పిల్లల అశ్లీల సమాచారంపై సంపూర్ణ నిషేధం అమలులో ఉంది.
ఇక పోర్న్ వెబ్‌సైట్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సైట్ల సంఖ్య వెయ్యి కంటే తక్కువగానే ఉంది. ఇక ఎప్పటికప్పుడు పోర్న్ వెబ్‌సైట్లు తమ ఐపీ అడ్రస్‌లను మారుస్తుంటాయి. అందువల్ల ఈ వెబ్‌సైట్లను దొంగ దారుల్లో నెటిజన్లు చూస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో మొదటి మూడు వారాల్లో పోర్న్ ట్రాఫిక్ భారత్‌లో 95 శాతం పెరిగిందని ఏప్రిల్ 2020లో పోర్న్‌హబ్ వెల్లడించింది. భారత్‌లో నిషేధం అమలులో ఉన్నప్పటికీ వీపీఎన్‌లు, ప్రోక్సీల ద్వారా నెటిజన్లు పోర్న్‌ను చూస్తున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు.
పోర్న్‌హబ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో బ్రిటన్, భారత్ ఉన్నాయి.సగటు భారతీయులు ఒక్కో వీడియోపై 8.23 నిమిషాలు వెచ్చిస్తున్నట్లు పోర్న్‌హబ్ తెలిపింది. మరోవైపు పోర్న్‌చూసే వారిలో 44 శాతం మంది 18 నుంచి 24ఏళ్ల వయసు వారేనని తెలిపింది. మరో 41 శాతం మంది 25 నుంచి 34ఏళ్ల మధ్య వయసువారని వెల్లడించింది. మొత్తంగా భారత్‌లో పోర్న్‌చూసేవారి సగటు వయసు 29ఏళ్లుగా పోర్న్‌హబ్ నివేదిక తెలిపింది. పోర్న్‌హబ్ చూస్తున్న భారతీయుల్లో 30 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)