Survey Report: 46% కాలేజీ యువత శృంగార సంబంధ వీడియోలకు బానిస, 10% శాతం మంది అమ్మాయిలకు కౌమార వయసులోనే అబార్షన్స్. ఓ సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు
Representational Image | (Photo Credits: File Image)

Mumbai, September 23:  ఈమధ్య ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం, అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం ఎంతటి దుష్పరిణామాలకు దారితీస్తుందో అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. ఇటీవల ఒక ప్రైవేట్ స్వచ్ఛంధ సంస్థ ముంబైలోని వివిధ జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 46 శాతం 16-22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు విస్తృతంగా అశ్లీలత మరియు అడల్ట్ కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారని  ఆ సర్వేలో వెల్లడైంది. రెస్క్యూ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఛారిటబుల్ ట్రస్ట్ (Rescue Research & Training Charitable Trust) అనే ప్రైవేట్ సంస్థ చేపట్టిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలోని వివిధ ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో చదివే సుమారు 500 మంది విద్యార్థులను ప్రశ్నించినపుడు సగం వరకు విద్యార్థులు నిర్భయంగా తాము అశ్లీల వీడియోలకు బానిసైనట్లు తెలియజేశారు. మిగతావారు తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించేందుకు ఇష్టపడకపోగా, అతికొద్ది మంది మాత్రమే తాము అశ్లీల వీడియోలకు దూరంగా ఉంటున్నట్లు తెలియజేశారు. ఈ సర్వే ఆధారంగా సేకరించిన వివరాలను గమనిస్తే ఇలా ఉన్నాయి.

కనీసం 33 శాతం మంది బాలురు మరియు 24 శాతం బాలికలు తమ సహచర విద్యార్థులతో మొబైల్ ఫోన్లలో సెక్స్ సంబంధ విషయాలు చర్చించుకున్నారు, ఒకరికొకరు తమ నగ్నచిత్రాలను పంచుకున్నారు.

బాలురలో 40 శాతం మంది అత్యాచార సంబంధిత, హింసాత్మక వీడియోలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఒక విద్యార్థి వారంలో కనీసం 40 రేప్ వీడియోలను చూసినట్లు తెలిపాడు. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత వారికి కూడా గ్యాంగ్ రేప్ చేయాలనే ఆలోచనలు కలిగినట్లు 60 శాతం బాలురు వెల్లడించగా, వీరిలో 25 శాతం మంది బాలురు ఖచ్చితంగా 'అలాంటి' పనిచేసేందుకు ప్రయత్నాలు చేశామని పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది.  వీరిలో చాలా మంది తమ కోరికలను తీర్చుకునేందుకు వ్యభిచారులను కూడా ఆశ్రయిస్తున్నట్లు అంగీకరించారు.

ఇదిలా ఉంటే, ఈ సర్వేలో పాల్గొన్న 16-22 ఏళ్ల అమ్మాయిల్లో 10 శాతం మందికి ఇప్పటికే అబార్షన్ అయినట్లు వెల్లడించడం షాక్‌కు గురిచేస్తుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ముంబైలో ప్రతీనెలా కనీసం 4000 మంది కాలేజీ విద్యార్థినులు గర్భందాలుస్తూ, అబార్షన్ కోసం వివిధ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిసింది.

ఎంతో భవిష్యత్తు ఉండే యువత, కౌమార దశలోనే ఇలా తప్పుదారి పట్టడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇది కేవలం ముంబై నగరానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ విపరీత ధోరణులు కొనసాగుతున్నాయి. అత్యాచార నిరోధాలకు ప్రభుత్వాలు ఎన్ని పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా, ప్రతిరోజూ దేశంలోని ఏదో ఒక మూలన జరుగుతున్న పాశవిక అత్యాచార ఘటనలు కలవర పెడుతున్నాయి.

యువతలో విపరీత ధోరణలను అరికట్టేందుకు పేరేంట్స్ శ్రద్ధ వహించడంతో పాటు, కాలేజీ యాజమాన్యాలు మరియు ప్రభుత్వాలు ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు మరియు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. కళాశాల స్థాయిలోనే సైబర్ ఎథిక్స్ సబ్జెక్ట్‌ను సిలబస్‌లోచేర్చడం, కాలేజ్ స్టూడెంట్స్‌కు ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించడం మరియు పోర్న్ బ్లాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్తున్నారు. కౌమార దశలో ఉన్న పిల్లలను ఒంటరిగా ఉంచకుండా కుటుంబ సభ్యులు వారిని ఒక కంట కనిపెడుతూ నలుగురితో కలిసి ఉండేలా చూడాలని సూచిస్తున్నారు.