Bhogi Pongal 2021: భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
పెద్ద పండుగను (Bhogi Pongal 2021) పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president kovind) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు (CM YS Jagan, CM KCR) శుభాకాంక్షలను తెలిపారు.
New Delhi, Jan 13: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. పెద్ద పండుగను (Bhogi Pongal 2021) పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president kovind) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు (CM YS Jagan, CM KCR) శుభాకాంక్షలను తెలిపారు.
దేశ పౌరులందరికీ లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, భోగాలి బిహు, ఉత్తరాయణ్, పౌష్ పర్వ శుభాకాంక్షలు. ఈ పండుగ మన సమాజంలో ప్రేమానురాగాలను, శాంతి సామరస్యాలను మరింత బలపడేందుకు తోడ్పడాలి. దేశంలో భోగభాగ్యాలను, సుఖసంతోషాలను పెంపొందించాలి' అని రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు.. గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మన ప్రత్యేకమైన కళలకు ఈ సంక్రాంతి పండగ ప్రతీక అని పేర్కొన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత 19 నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. ఇక మీదట ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Here's President of India Tweet
AP CM YS Jagan Tweet
TS CMO Tweet
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, బోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. సంతోషంగా బోగి, కనుమ, సంక్రాంతిని జరుపుకోవాలని కోరారు.
చార్మినార్ దగ్గర నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని.. భాగ్యలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గత ఏడాదంతా కరోనాతో ఇబ్బందులు పడ్డామని.. ఆ చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలని అభిలషించారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సిరిసంపదలు ఇచ్చే పండుగ అన్నారు. అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని కవిత పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్స్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తన కుటుంబ సభ్యులతో కలిసి భోగీ పండుగని విజయవాడలోని తన నివాసంలో జరుపుకున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం పిల్లలకు బోగిపళ్ళు పోసి పలు సాంసృతిక కార్యక్రమాలను బాబు తిలకించారు. ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, నేటం రఘురాంతో భారీగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.