Godavari Floods: ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, జల దిగ్భంధంలో పలు గ్రామాలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది, ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు
మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది ( Godavari river) బుధవారం మహోగ్రరూపం దాల్చింది. గోదావరి నది (Godavari Floods) వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు.
Rajamandri, July 14: దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉండడంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు వంగి ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఎల్లుండి వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 12వ తేదీ మధ్య 45 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 75 శాతం అధికంగా 78.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది ( Godavari river) బుధవారం మహోగ్రరూపం దాల్చింది. గోదావరి నది (Godavari Floods) వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు.
బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి 15,11,169 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 15.1 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కాళేశ్వరంలో 14.67 మీటర్లు, పేరూరులో 16.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.41 మీటర్లు, కూనవరంలో 22.27మీటర్లు, కుంటలో 13.31 మీటర్లు, పోలవరంలో 13.84 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 17.23 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి.
Here's Godavari Floods Visuals
వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి (Dowleswaram barrage) గల 175 గేట్లు ఎత్తేశారు. డెల్టా కాలువలకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 15,07,169 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 19 లక్షల క్యూసెక్కులు దాటితే ఇళ్లలోకి నీరు చేరుతుందని భావిస్తున్నారు. గురువారం రాత్రికి బ్యారేజీలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో జూలై రెండో వారంలోనే గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం సముద్రంలో కలుస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 3.82 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో కడెం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టులోకి కడెం వాగు నుంచి 5.69 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేసి.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజీలోకి 17.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.
భారీగా వరద నీరును దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 15,14,976 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 54.70 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికి భద్రాచలం వద్దకు 18 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉందని.. నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. గోదావరి చరిత్రలో ఆగస్టు 16, 1986లో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. భద్రాచలం వద్ద వరద మట్టం 75.6 అడుగులుగా నమోదైంది.
ఏపీలో ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 14,54,636 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే వద్ద నీటిమట్టం 34.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వరద విడుదల చేస్తుండటంతో దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 26 మీటర్లకు చేరుకుంది. గురువారం ఉదయానికి పోలవరం ప్రాజెక్టులోకి 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద మళ్లీ పెరగడంతో అనేక గ్రామాలు భయం గుప్పిట్లోకి వెళ్లాయి. పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. నాలుగు మండలాల్లో 87 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా ఇప్పటికే 6,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చింతూరు ఐటీడీఏలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో సైతం వరద ముంపు మరింత పెరిగింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఊడుమూడిలంక, నాగుల్లంక, కె.ఏనుగుపల్లి గ్రామాల్లో సుమారు నాలుగు అడుగుల నీరు చేరింది. మానేపల్లి శివారు పల్లిపాలెం, శివాయలంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, కనకాయలంక, పెదమల్లంలంక, అనగారలంక గ్రామాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 43 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గోదావరి వరద సహాయక చర్యల్లో 6 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గోదావరి లంక గ్రామాల ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 1800–425–0101, 08632377118లో సంప్రదించాలన్నారు.
గోదావరితో పాటు కృష్ణా నది దాని ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం, ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తేసి దిగువకు భారీ ఎత్తున వరదను విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గురువారం నుంచి వరద ప్రవాహం పెరగనుంది. పశ్చిమ కనుమల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 167.49 టీఎంసీలు అవసరం.
నాగార్జునసాగర్‌కు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల మూసీ నుంచి పులిచింతల్లోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతలకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి వరద కృష్ణా నది మీదుగా ప్రకాశం బ్యారేజీలోకి 27,746 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 23,746 క్యూసెక్కులను 30 గేట్లను అరడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)