Amaravati, July 13: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ( low pressure formed over the Odisha-AP coast) మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు (AP to receive Heavy Rains) కురిసే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఇక గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. మంగళవారం పలు గ్రామాల నుంచి 1,125 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కూనవరం మండలం టేకులముండి నుంచి 275 మంది, రాజుపేట, వడ్డిగూడెం గ్రామాల నుంచి 200 మంది, టేకులబోరు, కూనవరం, గిన్నెల బజార్, రేఖపల్లి గ్రామాల నుంచి 300 మంది, ధర్మతులగూడెం నుంచి 350 మందిని బోట్ల ద్వారా బయటకు తీసుకువచ్చి షెల్టర్లకు తరలించారు.
తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Andhra Pradesh Rains) కురుస్తున్న కారణంగా గోదావరికి ఉధృతి పెరిగింది ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరిస్థితిని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు అందిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక, భారీ వర్షాల నేపథ్యంలో రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద ప్రభావితం చేసే మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల్లో మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. కాగా, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగరాదని, ఏ ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు, వ్యక్తికి అయితే రూ.1,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.
అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణం రూ.8 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. గోదావరికి వందేళ్లలో ముందస్తు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ సహాయ చర్యలపై మార్గ నిర్దేశం చేశారు. వరద నష్టంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి సీఎంవో అధికారులకు రోజువారీ నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు.