Visakha Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు, పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచన
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని (Visakha Steel Privatization) స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ఎంపీ సత్యనారాయణ (MP Satyanarayana) అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ... స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధలేదని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు.
Amaravati, Mar 8: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని (Visakha Steel Privatization) స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ఎంపీ సత్యనారాయణ (MP Satyanarayana) అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ... స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధలేదని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు.
స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని, ప్రభుత్వం సహకారం అవసరమైనప్పుడు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. మెరుగైన నిర్వాహణ చేపట్టవచ్చని, ప్రైవేటీకరణ వల్ల స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరుగుతుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, భాగస్వాములు, ఉద్యోగుల షేర్లు కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించింది. షేర్స్ కొనుగోలు అగ్రిమెంట్ ఉంటుందని స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీలు, ఇతర పార్టీలు, ప్రభుత్వం ఎలా స్పందిస్తునేది ఉత్కంఠ నెలకొంది.
ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. బీజీపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం కేంద్రాన్ని ఒప్పించగలం అనే ధీమాతో కనిపించింది. ఇటు జనసేన సైతం కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందని ఆశిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటనతో ఆశలు నీరుగారిపోయాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆరు దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై… పాండే ట్వీట్‌తో నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా ఇటీవలే జరిగిన ఏపీ మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవలే ఏపీలో బంద్ జరిగింది. ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ బంద్‌లో బీజేపీ పాల్గొనలేదు. వామపక్షాలు, ప్రతిపక్ష టీడీపీ సహా అధికార వైసీపీ పాల్గొంది. ఆయా పార్టీల నేతలు కదం తొక్కారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 22 నుంచి పాదయాత్ర చేశారు. జీవీఎంసీ గేటు దగ్గరి నుంచి స్టీల్ ప్లాంట్ గేటు వరకు ఆయన పాదయాత్ర చేశారు.