Amaravati, Feb 6: కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై (RINL Privatisation) ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.'విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలి. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని లేఖలో కోరారు. విశాఖ ఉక్కు (Visakha steel plant) ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని అలాగే పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని ప్రైవేటీకరణ ఆపాలని కోరారు.
విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చింది.దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారు.నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్ మంచి పనితీరు కనపరిచింది. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని లేఖలో తెలిపారు.
స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చు.7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారు. డిసెంబర్ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది.
దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయి. వైజాగ్ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లొచ్చు.'అని సీఎం (CM YS Jagan Mohan Reddy) లేఖలో పేర్కొన్నారు.
ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, ఈ భూముల విలువ రూ.1 లక్ష కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఉత్పత్తి వ్యయం భారం కావడం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుందని వెల్లడించారు. ప్లాంటును బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని లేఖలో కోరారు. విశాఖ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకెళ్లొచ్చు. బ్యాంకు రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుంది. వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం తగ్గుతుంది.’’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే (Visakha steel plant privatisation) ప్రభుత్వమే తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పారు.
ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ప్రభుత్వం తరపున ప్రపోజల్ వేస్తామన్నారు. ఉద్యమాల నుంచి స్టీల్ ఫ్యాక్టరీ పుట్టిందని..ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తే ప్రభుత్వం తరపున బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పారు. పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి ఏపీకి చాలా రావాల్సివుందని తెలిపారు.