Vishakhapatnam, March 5: విశాఖపట్నం ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ శుక్రవారం పాటిస్తున్నారు. బిజెపి మినహా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు పూర్తిగా తమ మద్ధతు ప్రకటించాయి. ఈ బంద్‌కు ఏపీ ప్రభుత్వం కూడా సంఘీభావం తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. వైజాగ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కూడా ఈరోజు అధికారికంగా సెలవు ప్రకటించారు.
లారీ యజమానుల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మరియు కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వమే బంద్‌కు మద్ధతు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు తిరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాష్ట్ర బంద్‌కు టిడిపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏ పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ప్రకటించారు.
బంద్ పిలుపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు.