Amaravati, Mar 4: కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవైటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు మార్చి 5న ఏపీ బంద్ కు (AP Bandh on 5th March 2021) పిలుపునిచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) కార్మికసంఘాలతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన అన్ని కార్మికసంఘాలు ఏపీలోని 13 జిల్లాల్లో రేపు బంద్ (Andhra Pradesh Bandh) నిర్వహించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ బంద్ కు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కార్మికసంఘాలు భావిస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు (VSP privatisation issue) కేంద్రం వేగంగా పావులు కదుపుతున్న వేళ దాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని కార్మికసంఘాలు భావిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పేరుతో ఏర్పాటైన కమిటీతో పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. దీన్ని మరింత తీవ్రతరం చేసేందుకు వీలుగా రేపు ఏపీ బంద్‌కు కార్మికసంఘాలు పిలుపునిచ్చాయి.
అధికార పార్టీ మద్ధతు : రేపటి (శుక్రవారం) ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తెలుగువాళ్ల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు అని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ (Steel plant privatisation) కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు.
దీనిలో భాగంగా రేపటి (శుక్రవారం) ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఒంటిగంట తర్వాత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
శుక్రవారం చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గురువారం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల పక్షాలు, కార్మిక సంఘాలు చేపడుతున్న రాష్ట్ర బంద్‌కు ఉద్యోగులు, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మద్దతు ప్రకటించలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ప్రకటించటం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దానిలో భాగంగా గత నెల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు.
టీడీపీ మద్దతు: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న కార్మికులకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. రేపు జరిగే బంద్‌కు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని నారా లోకేష్ పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మార్చి 5న జరిగే బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ మద్ధతు : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే బంద్‌కి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం త్వరలోనే రాహుల్ గాంధీ విశాఖ వస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. రైల్వే జోన్ లేదు.. విభజన హామీలు అమలు చేయడంలో మోదీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. మోదీ హయాంలో అమ్మేస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.
కేంద్రం తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఇరుకున పడ్డ వారిలో బీజేపీ-జనసేన పార్టీలు ముందువరుసలో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేక, అలాగని అంగీకరించి స్ధానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్ధితి లేక ఇరుపార్టీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికీ కేంద్రం స్టీల్ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోలేదని చెప్పుకుంటన్న బీజేపీ నేతలు ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ఏఫీలో అధికార, విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న బీజేపీ-జనసేన కూటమి రేపటి బంద్‌కు దూరంగా ఉండనుంది