Etela vs Gangula: గంగులా..2023లో అధికారంలో ఉండవని తెలిపిన ఈటెల రాజేందర్, నా వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేసిన కమలాకర్, తెలంగాణలో హీటెక్కిన మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ రాజకీయాలు అదే స్థాయిలో వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ప్రధానంగా హుజుర్‌నగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ వర్సెస్ ఈటెల రాజేందర్ (Etela vs Gangula) అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి.
Hyderabad, May 18: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ రాజకీయాలు అదే స్థాయిలో వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ప్రధానంగా హుజుర్‌నగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ వర్సెస్ ఈటెల రాజేందర్ (Etela vs Gangula) అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి.
ఈటల రాజేందర్‌పై (Former minister Etela Rajender) భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన మరుక్షణం నుంచే ఆయన్ను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో ఈటలపై మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ (minister Gangula Kamalakar) తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు. జిల్లాలో మంగళవారం మాట్లాడిన ఆయన.. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. ఆయన బెదిరిస్తే భయపడేవాడు ఎవడూ లేడన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్నారు కాబట్టి ఇన్నిరోజులు గౌరవించామని.. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు.
దీనికి అదే స్థాయిలో ఈటెల స్పందించారు. తనపై కక్షతో గోదాములు, పౌల్ట్రీని సీజ్ చేయవద్దని.. ప్రజలను వేధించవద్దని హితవు పలికారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా వచ్చే నాయకులు ఏనాడైనా సర్పంచ్, జెడ్పీ, ఎంపీటీసీల గెలుపులో సహాయం చేశారా? తోడ్పాటు అందించారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈటెల ఏమన్నారు : హుజుర్‌నగర్‌లో మంగళవారం ఈటల రాజేందర్ తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కరీంనగర్ ప్రజలు చల్లగా చూడమని గంగులను గెలిపించారు. హుజూరాబాద్‌పై పడి బెదిరించమని కాదు. బిల్లులు రావు, పనులు జరగవు, గ్రామానికి రూ.50 లక్షలు కావాలంటే.. మాతో ఉండాలని ఒత్తిడి చేసి, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదు. మంత్రులు కాకముందు సంస్కారం లేకపోతే ఫర్వాలేదు, మంత్రి అయ్యాకైనా నేర్చుకోవాలి. అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమలో ఉన్నట్లే. ప్రజలను చిన్నచూపు చూసిన వారికి భవిష్యత్‌లో అదే గతి పడుతుంది. కరీంనగర్ జిల్లాలో ఎన్ని గుట్టలు మాయమై బొందలగడ్డగా మారాయో.. ఎన్ని కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టావో తెలుసు. 2023లో అధికారంలో ఉండవు’ అని మంత్రి గంగుల వైఖరిపై మండిపడ్డారు.
హుజురాబాద్‌లో మా మిత్రుడికి ఇంఛార్జి ఇచ్చినట్టు తెలిసింది. కానీ మొన్న ఎంపీ ఎన్నికల్లోనూ మిగతా అన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వేస్తే..54 వేల మెజారిటీ ఇచ్చి ఆదుకున్న నియోజక వర్గం హుజురాబాద్. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తాను’ అని మీడియా వేదికగా ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్‌ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్న వారా?. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సరే మీరు సాయం చేశారా?. నాపై తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో.. ఎవడూ వెయ్యేళ్ళు బ్రతకరు.. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నావ్’ అని గంగులపై ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ ఈటల వార్నింగ్ ఇచ్చారు.
చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. నువ్వు (గంగుల) ఎన్ని టాక్స్‌లు ఎగ్గొట్టినవో తెలవదు అనుకుంటున్నావా?. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది. 2006లో కరీంనగర్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా.. ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారంతో మర్యాద పాటిస్తున్నా. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారు’ అంటూ ఈటల తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
గంగుల ఏమన్నారు : 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను. నీలాగ అసైన్డ్ భూములను ఆక్రమించుకోలేదు. అసైన్డ్ అని తేలాక కూడా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావు. 2004లో దివంగత నేత ఎమ్మెస్సార్ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తే... ఆయన కుదరదని తేల్చి చెప్పారు. 2018లో నా ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల. గెలిచినప్పటి నుంచి అసహనంతో ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. టీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఈటల. సజీవ సాక్ష్యాలివి. దాస్తే దాగేవి కావు. ఇవాళ ఆయన అన్నదానికంటే ఎక్కువగా అనగలను. తట్టుకోలేవు. భయంకరంగా ఉంటుంది. పార్టీని కాపాడుకుంటాం.
వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. సివిల్ సప్లై స్కీమ్ పెండింగ్‌లో ఉంది. నా పరిధిలోకి రాదని సీఎం దృష్టికి తీసుకు వెళ్లలేదు. జిల్లా బొందలగడ్డ అయ్యిందంటున్నావు.. గ్రానైట్ క్వారీల లెక్కలు తీయి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. సీబీఐకి రాయి. నా గ్రానైట్ కంపెనీలపై సమైక్యాంధ్రలో విజిలెన్స్ కమిటి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. హుజూరాబాద్‌లో నువ్వు శూన్యంలో ఉన్నావు. మా పార్టీ బలంగా ఉంది. నీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టం. సాగర్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పెట్టి కొన్నామా... తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతావని అంటావా... మాకు పదవులు ముఖ్యం కాదు.
కేసీఆర్ అధికారంలో ఉంటే చాలనుకుంటున్నాం. టీఆర్ఎస్‌కు ఓటేస్తే అమ్ముడు పోయినట్టా... నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఆచితూచి మాట్లాడుతున్నాము. ఏం చేస్తావు.. వాట్సాప్, యూట్యూబ్‌లలో తిట్టిస్తావు అంతే కదా. ఇదిగో వెంట్రుక కూడా పీకలేవు’’ అంటూ తలపై చేయి వేసి అన్నారు. ‘‘నేను ఫుల్ బీసీని... ఎక్కడైనా బీసీనే. నువ్వు హాఫ్ హాఫ్ బీసీవీ.. హుజూరాబాద్ బీసీవీ... హైదరాబాద్ ఓసీవీ’’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)