Hyderabad, May 1: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈటెల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ (Telangana Governor) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా (Etela Rajender From Health Ministry) ఉండనున్నారు. ఈటల మంత్రి పదవులను తనకు బదిలీ చేయాలంటూ కేసీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. ఇది జరిగిన వెంటనే ఈటల మీడియా ముందుకు వచ్చారు. తన శాఖ నుంచి తనను సీఎం (Telangana chief minister K Chandrashekhar Rao) తొలగించారని తెలిసిందని... చాలా సంతోషం అని చెప్పారు.
అన్ని శాఖలపై ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉన్నాయని... అందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడతానని అన్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఇదంతా జరుగుతోందని ఈటల వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ తోనే భూకబ్జా ఆరోపణలు చేశారని అన్నారు. అందరు నేతలు ఎన్నికలలో నిమగ్నమైతే... తాను పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించారని ఈటల తెలిపారు. అందుకే ఏం జరుగుతోందో తనకు తెలియలేదని అన్నారు. 25 ఏళ్ల జీవితంలో తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పారు. మనసులో ఏదో పెట్టుకుని, కుట్ర పూరిత కథనాలతో, ఎదుటి వారి క్యారెక్టర్ ను నాశనం చేయాలనుకోవడం దారుణమని అన్నారు.
తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే సంగతి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 25 ఏళ్ల చరిత్రలో మచ్చలేని మనిషిగా నిలిచానని అన్నారు. ఎవరిపైనా తను వ్యక్తిగత విమర్శలు చేయబోనని అన్నారు. కేసీఆర్ ను కాంటాక్ట్ చేస్తారా? అనే మీడియా ప్రశ్నకు బదులుగా... ఎవరినీ కాంటాక్ట్ చేయబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ తో పాటు ఎవరినీ కలవబోనని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిమానులు, అనుచరులతో కూడా చర్చిస్తానని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలోనే కేసీఆర్‌ను కలిశానని, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్ర జరిగిందని.. తాను ఎక్కడా భూములు ఆక్రమించలేదని పేర్కొన్నారు. ‘‘నాపై ఆరోపణలు వచ్చిన వెంటనే నన్నే పిలిచి అడగొచ్చు కదా?. కేసీఆర్‌కు తెలియకుండా ప్రభుత్వంలో చీమ చిటిక్కుమంటుందా?. మంత్రి హోదాలో ఉండి నా సమస్యలే పరిష్కరించుకోలేకపోయా. నాకు పార్టీ పెట్టే ఆలోచన లేదు. భవిష్యత్ కార్యాచరణపై నాకే క్లారిటీ లేదు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని’’ ఈటల అన్నారు.
కాగా ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఈటలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి.. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారణ ప్రారంభించారు. వివాదాస్పద అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్‌లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. భూముల్లో డిజిటల్ సర్వే కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాత సీఎస్‌కు నివేదిక అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
కాగా మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంపై విచారణ కొనసాగుతోంది. హకీంపేట, అచ్చంపేటలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారుల విచారణ చేపట్టారు. బాధితుల నుంచి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రైతుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అసైన్డ్‌దారులను పిలిచి రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. హకీంపేట, అచ్చంపేట శివారు 170 ఎకరాల భూముల్లో డిజిటల్ సర్వే చేపట్టారు. ఈటలకు చెందిన హ్యాచరీతో పాటు అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే చేస్తున్నారు. మూడు టీమ్‌లుగా రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు డిజిటల్ సర్వే చేపట్టారు.