Hyderabad, May 3: తెలంగాణ రాష్ట్రమంత్రి వర్గం నుంచి ఈటల రాజేంధర్ బర్తరఫ్ అయ్యారు. భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నివేదిక సమర్పించిన తర్వాత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈటలపై వేటు వేశారు. ఈటల రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ ముఖ్యమంత్రి చేసిన సిఫార్సుకు గవర్నర్ డా. తమిళిసై సౌందర్యరాజన్ ఆదివారం సాయంత్రం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాజ్ భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు, ఈటల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ తన పరిధిలోకి తెచ్చుకున్నారు. అప్పటికీ ఈటల రాజేంధర్ ఏ శాఖలేని మంత్రిగా మంత్రివర్గంలోనే ఉన్నారు. తాజాగా ఆయన మంత్రి పదవిని కూడా తొలగించటంతో ఈటల రాజేంధర్ పూర్తి స్థాయిలో పదవీచ్యుతుడయ్యాడు. అయితే ప్రస్తుతం ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతున్నారు. ఇకపై ఆయన టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా? పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అన్న విషయంపై ఈటల ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని విషయాలపై మాట్లాడతానని మాత్రం ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
ఏదైమైనా, ఈటల రాజేంధర్ మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూకబ్జాలకు పాల్పడటం నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అచ్చంపేటలో ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మెదక్ కలెక్టర్ , ఎసిబి విజిలెన్స్ బృందాలు వేగంగా దర్యాప్తు జరిపాయి. కలెక్టర్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం, 66 ఎకరాల 1 గుంట అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా జమునా హచరీస్ లిమిటెడ్ తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకా, రహదారి నిర్మాణం కోసం అనేక వృక్షాలను అక్రమంగా నరికివేశారని రిపోర్టులో పేర్కొన్నారు. కొన్ని పట్టా భూములను సైతం వ్యవసాయేతర భూములుగా మార్చారని, అలాంటి భూములపై భవనాలు కూడా నిర్మించారని నివేదిక పేర్కొంది.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న ఈటల రాజేంధర్ పట్ల అటు పార్టీ పరంగా, అలాగే ఇటు ప్రభుత్వం పరంగా ఇంకా ఏవైనా చర్యలు తీసుకుంటారా? ఇంతటితో వదిలేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.