ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో తమిళనాడురాష్ట్రంతో పాటు ఏపీలోని రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇక ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఈ నెల 14, 20 తేదీల్లో బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అదే జరిగితే భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. ఆ అల్పపీడనం వల్ల 14, 15 తేదీల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ఇదే విధంగా ఈ నెల 20న కూడా మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.దానిపై ఇంకా సమాచారం లేదని ఐఎండీ వర్గాలు తెలిపాయి.
ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేశారు.
తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం భన్సల్. మరోవైపు.. వరద నీటి భారీగా వచ్చి చేరుతుండటంతో స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద 7 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు అధికారులు. బాలిరెడ్డిపాలెం-గంగన్నపాలెం మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఏడు అడుగులకు చేరుకుంది. దీంతో, 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రోడ్లు, ఆనకట్టలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు.
జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062
సూళ్లూరుపేట ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020
తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040
శ్రీకాళహస్తి ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474
తెలంగాణలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత
ఇక తెలంగాణలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ సిటీలో రెండు రోజులు చలిగాలులు తీవ్రంగా ఉంటాయి. టెంపరేచర్ 3 నుంచి 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం ....రాత్రి సమయాల్లో పొగమంచు తీవ్రంగా పడుతుంది. వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కప్పేసింది. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.