Tungabhadra Pushkaralu: 12 ఏళ్ల తరువాత..తుంగభద్ర నది పుష్కరము, దివంగత వైఎస్సార్ తరువాత తనయుడు వైయస్ జగన్ ప్రత్యేక పూజలు, ఖరారైన ఏపీ సీఎం పర్యటన, తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక కథనం
ఈ 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడినవారు పుష్కరాలకు రావొద్దని ప్రభుత్వాలు సూచించాయి.
Kurnool, Nov 18: ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కొనసాగే తుంగభద్ర పుష్కరాలపై (Tungabhadra Pushkaralu) తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. ఈ 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడినవారు పుష్కరాలకు రావొద్దని ప్రభుత్వాలు సూచించాయి.
కాగా కరోనా నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కరఘాట్లలోకి అనుమతించనున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పుష్కరఘాట్లకు అనుమతి నిరాకరించనున్నారు. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్ర్కీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు. పుష్కరఘాట్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరిగా ఉంచనున్నారు. మాస్కు ధరించడం, ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి చేసింది. కొవిడ్ నిబంధనలకు లోబడి పుష్కర స్నానాలకు అనుమతి ఇవ్వనున్నారు. పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ. 2.5 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో పుష్కరఘాట్ల వద్ద మౌలిక వసతులతోపాటు, అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (minister indrakaran reddy) సూచించారు.
తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో సౌకర్యాల కల్పన కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు కేటాయించింది. ఇరిగేషన్ శాఖ అధ్వర్యంలో ఇప్పటికే మెట్లు, బారికేడ్లు, మెస్ పనులు మొదలయ్యాయి. తాజాగా మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేసింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నదిలో స్నానానికి అనుమతి లేదని దేవాదాయశాఖ స్పష్టం చేసింది. దీనివల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని తెలిపింది. అయితే నది ఒడ్డున, అక్కడి ఆలయాల వద్ద పిండ ప్రదానం వంటి వైదిక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. నది ఒడ్డున ఉండే ఆలయాల్లో దర్శనాలకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తుంగభద్ర పుష్కరాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
తుంగభద్ర పుష్కరాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
Here's DDIPR_KNL Tweet
Here's Kurnool Police Tweet
సీఎం సందర్శించే సంకల్‌భాగ్ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు.
సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ (Collector G Veerapandian) ఆదేశించారు. పుష్కరాలకు సీఎం వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ పనులన్నీ బుధవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్ ఘాట్‌ను పరిశీలించారు.
అలాగే బెటాలియన్ నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, ఎస్టీబీసీ కళాశాల, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నరసింగరావు పేట మీదుగా సంకల్‌భాగ్‌లోని పుష్కరఘాట్ వరకు సీఎం వెళ్లే దారిని చూశారు. సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి చేయనున్న పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని నగరపాలక కమిషనర్‌ను ఆదేశించారు.
ఏపీ సీఎం పర్యటన ..
ఉదయం 11 గంటలు : తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు.
11.20 : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
11.30 : గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు బయలుదేరుతారు.
12.30 : ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
12.40 –12.55 : ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1 గంట : ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డుమార్గాన సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌కు బయలు దేరుతారు.
1.10 : సంకల్‌భాగ్‌కు చేరుకుంటారు
1.10 – 1.50 : పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
1.50– 2.00 : సంకల్‌భాగ్ నుంచి బయలుదేరి బెటాలియన్‌కు చేరుకుంటారు.
2.05– 2.20 : బెటాలియన్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
2.30 : ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు.
12 సంవత్సరాలకు ఒకసారి తుంగభద్ర నది పుష్కరము
బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్రనది పుష్కరాలు నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర నది పుష్కరాలు గతంలో 2008, డిసెంబర్ 10న ప్రారంభమై 12 రోజుల పాటు జరిగాయి. ఇప్పుడు మళ్లీ పుష్కరాలు జరగనున్నాయి.
తుంగ, భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప్రదేశ్లో ప్రవేశించి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించడం ఇది తొలిసారి. ఈ నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల నుండి ప్రవహిస్తుంది కాబట్టి రెండు జిల్లాలలో ఉన్న తుంగభద్ర తీరప్రాంతాలలో స్నానఘాట్లను ఏర్పాటుచేసి జిల్లా యంత్రాంగం 12 రోజుల పాటు యాత్రికులకు సౌకర్యాలు కలుగజేసింది.
దేశంలో పుష్కరాలు నిర్వహించే 12 నదులలో తుంగభద్రనదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర పుష్కర నదుల లాగా కాకుండా ఈ నది సరాసరి సముద్రంలో సంగమించదు. అంతేకాకుండా ఈ నది పుట్టుక కూడా ఇదే పేరుతో లేదు. కర్ణాటక రాష్ట్రంలో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడిన ఈ నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర రెండు జిల్లాలలోనే ప్రవహిస్తున్ననూ అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా వాసులు కూడా ఈ నీటిని వినియోగిస్తున్నారు. చెన్నై వరకు వెళ్ళే తెలుగుగంగలో కూడా తుంగభద్ర ఉంది. చరిత్రలో ప్రముఖ రాజ్యమైన విజయనగర సామ్రాజ్యము తుంగభద్ర తీరానే వెలిశింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుంగభద్ర పుష్కరాలు
కాగా కర్నూలు జిల్లాలో 17 ఘాట్లను, మహబూబ్ నగర్ జిల్లాలో 5 ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటుచేసి పుష్కర సమయంలో వచ్చే భక్తులు, యాత్రికులకు సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది.మహబూబ్ నగర్ జిల్లాలో 5 తుంగభద్ర పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అన్నింటిలో ప్రముఖమైనది ఆలంపూర్. ఇది కాకుండా వడ్డేపల్లి మండలం రాజోలి, మానోపాడు మండలం పుల్లూరు, అయిజా మండలం వేణిసోంపూర్, పుల్లికల్ లలో ఘాట్లను ఏర్పాటుచేస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కరాల కోసం రూ. 4.5 కోట్లను కేటాయించింది. తొలి రోజు (డిసెంబర్ 10, 2008) ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖమంత్రి రత్నాకర్ రావు, టీటీడి బోర్డు చైర్మెన్ ఆదికేశవులు నాయుడు ఈ పుష్కరాల్లో పాల్గొన్నారు. రెండో రోజున ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూడవ రోజు నుంచి జిల్లాలో భక్తుల రద్ది పెరిగింది. నాలుగు, ఐదవ రోజులలో సెలవు దినాలు ఉండుటచే ఊహించని రీతిలో రద్దీఏర్పడింది. రోజులు గడిచే కొలది రద్దీ పెరిగి 11వ రోజున భక్తుల సంఖ్య 2లక్షలకు పెరిగింది. చివరి రోజు రెండున్నర లక్షల ప్రజలు పుష్కర స్నానాలు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో 5 స్నానఘాట్లను ఏర్పాటు చేయగా దాదాపు సగభాగం కంటే ఎక్కువ రద్దీ ఒక్క ఆలంపూర్ లోనే ఏర్పడింది. పురాతనమైన దేవాలయాలు ఉండుట, 5వ శక్తిపీఠం కావడం, నదిలో నీళ్ళు సమృద్ధిగా ఉండుటచే దూరప్రాంతాల భక్తులు ఇక్కడికే వచ్చారు. వేణిసోంపూర్ అయిజా నుండి ఎమ్మిగనూరు వెళ్ళు మార్గంలో ఉండుటచే మంత్రాలయం వెళ్ళు భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. వేణుగోపాలస్వామి దేవాలయం ఉండుట ఇక్కడి అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డీపోలు ప్రధాన పట్టణాలనుండి పుష్కర స్థానాల వరకు ప్రత్యేక బస్సులను నడిపించారు.
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలకై 17 ఘాట్‌లను ఏర్పాటుచేశారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాలో లక్షలాది యాత్రికులు వచ్చారు. జిల్లా కేంద్రంలోనే 5 పుష్కర స్నానఘాట్లను ఏర్పాటు చేయగా తుంగభద్ర పంప్‌హౌస్, సంకల్‌బాగ్‌లలో 5లక్షల వరకు భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. విశ్వహిందూ పరిషత్తు ప్రముఖుడు ప్రవీణ్ తొగాడియా కూడా కర్నూలులో సంకల్‌బాగ్ వద్ద స్నానమాచరించాడు. జిల్లాలోని ప్రముఖ పట్టణాల నుండి పుష్కర ఘాట్‌ల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.