దసరా పండుగ హిందువులకు చాలా పవిత్రమైన, ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.
తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. దసరా పండగ అంటే చాలు ఎక్కడ లేని సందడీ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అమ్మవారికి చేసే నవరాత్రి పూజలు ఒక వైపు.. స్థానికంగా జరిగే సంబరాలు మరోవైపు.. ఆధ్యాత్మిక పవనాలు.. సామాజిక సరదాలు.. బంధు మిత్రుల కలయికలు.. ఒకటనేమిటి అన్ని విధాలుగానూ దసరా పండుగ ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ప్రతి రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక విజయవాడతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ అమ్మవారికి నవ దుర్గ అలంకారాలు చేస్తారు. ఈ అలంకార సేవలు ఆలయ విధానాలను బట్టి వేరు వేరుగా ఉన్నా..దసరా రోజు మాత్రం అన్ని దేవాలయాల్లోనూ అమ్మవారికి పూజలు మాత్రం ఒకే విధంగా నిర్వహిస్తారు. ఇక అమ్మవారి పూజలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దసరా కోసం ప్రత్యేకంగా సంబరాలు నిర్వహిస్త్తారు.
పశ్చిమగోదావారి జిల్లా వీరవాసంలో వంద సంవత్సరాల నుంచి ఏనుగుల సంరంభం జరుపుతూ వస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లికి పూజలు చేస్తారు. సిరిమానోత్సవం విజయనగరంలో ఘనంగా నిర్వహిస్తారు. అయితే, ఈ పండుగ దసరా పండుగ తరువాత వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ళ యుద్ధం జరుగుతుంది. దసరా రోజు సాయంత్రం కాలువకు ఒకవైపు కొంత మంది ప్రజలు, మరో వైపు మరికొంత మంది ప్రజలు కంకర రాళ్లను గుట్టలుగా పోసి ఒకవైపు రామసేన మరోవైపు రావణ సేన గా ఊహించుకొని రాళ్లు విసురుకుంటారు.
ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత బాగా ఉత్సవం జరిగినట్టు. ఈ ఉత్సవం జరుపుకోవడం పై భిన్న వాదనలు ఉన్నాయి. కానీ, పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఈ రాళ్ళ యుద్ధం మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తోంది. దసరా పండుగ సందర్బంగా మచిలీపట్నం శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు బందరు పురవీధుల్లో ఈ ఊరేగింపు జరుపుతారు. చివరి రోజున కోనేరు సెంటర్ వద్ద జమ్మి కొట్టడంతో ఊరేగింపు ముగుస్తుంది. కర్నూలు జిల్లాలో 'కర్రల సమరం' నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు దసరా రోజున రాత్రి నుంచి ఉదయం వరకు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల ప్రజలు ఒకవైపు, మరికొన్ని గ్రామాల ప్రజలు మరోవైపు జట్లుగా ఏర్పడి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావటం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవటం జరుగుతాయి.
తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. తెలంగాణలో దసరా అంటేనే గుర్తుకొచ్చే సంబురం బతుకమ్మ పండుగ. శీతాకాలపు తొలి రోజుల పువ్వలనే దేవుళ్లుగా భావించి పూజించడం తెలంగాణలో విశేషం. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబురాలకు మహిళల సిద్ధమయ్యారు. కరోనా వేళ ఎవరికి వారే పరిమితంగా బతుకమ్మ ఆటలాడుతుండగా.. వచ్చే ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ గౌరమ్మను వేడుకుంటున్నారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి కాస్త సందడి తగ్గినా సద్దుల వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే మహిళలు మార్కెట్లలో రంగు రంగుల పూల కొనుగోలు చేసేందుకు బారులు తీరడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనం తదితర రంగు రంగుల పూలను సేకరించారు. కరోనా వ్యాప్తి క్రమంలో నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని అధికారులు, నాయకులు పిలుపునిచ్చారు. మాస్క్‌లు ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటిస్తూ ఆటలు ఆడుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఆయా ప్రాంతాల్లో నదీ తీరాలు, చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ వేడుకల కోసం అధికారులు, నాయకులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు సజావుగా బతుకమ్మలను నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు.
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్, ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.