U19 World Cup 2024 (Photo-ICC)

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2026 అండర్–19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక యువజట్ల టోర్నమెంట్‌కు ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్త ఆతిథ్యాన్ని వహించనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి 16 జట్లు పాల్గొనున్న ఈ మెగా ఈవెంట్ 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. మొత్తం 41 మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రాండ్ ఫైనల్‌కు జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నిలవనుంది.

టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌ రోజునే భారత జట్టుకు భారీ పరీక్ష ఎదురుకానుంది. జనవరి 15న భారత్ తన తొలి మ్యాచ్‌ను యూఎస్‌ఏతో ఆడుతుంది. ఇదే రోజు జింబాబ్వే–స్కాట్లాండ్, వెస్టిండీస్–టాంజానియా జట్ల మధ్య పోటీలు జరుగుతాయి. ముఖ్యంగా, టాంజానియాతొలిసారిగా అండర్–19 ప్రపంచకప్ వేదికపై అడుగుపెట్టడం ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు తన ప్రచారాన్ని జనవరి 16న ఐర్లాండ్‌తో ఆరంభించనుంది. మరో కీలక పోరులో భారత్–బంగ్లాదేశ్ జట్లు జనవరి 17న బులవాయోలో తలపడటం టోర్నమెంట్ హైలెట్‌గా భావిస్తున్నారు. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన అత్యధిక అండర్–19 పోటీలు తీవ్ర ఉత్కంఠను రేపిన నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.

ఈసారి భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో లేకపోవడం వల్ల లీగ్ దశలో ప్రత్యక్షంగా తలపడే అవకాశం లేదు. భారత్ గ్రూప్–ఏలో బంగ్లాదేశ్, యూఎస్‌ఏ, న్యూజిలాండ్ జట్లతో ఉండగా, పాకిస్థాన్ గ్రూప్–బిలో కొనసాగుతుంది. అయితే, సూపర్ సిక్స్ దశకు ఇరు జట్లు అర్హత సాధిస్తే, అక్కడ భారత్–పాకిస్థాన్ పోరు ఆ క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే విందు కానుంది.

టోర్నమెంట్ ఫార్మాట్లో మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ ముగిసిన తర్వాత అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి సెమీఫైనల్స్, ఫైనల్‌కి జట్లు ఎంపిక కాబోతున్నాయి. భారత జట్టు గతంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఉన్నందున ఈసారి కూడా అభిమానులు టైటిల్ ఆశలు పెట్టుకున్నారు.

టోర్నీపై స్పందించిన ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ..అండర్–19 ప్రపంచకప్ ఎన్నో గొప్ప క్రికెటర్ల ఎదుగుదలకు పునాది వేసిన వేదిక. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ వంటి అనేకమంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ నుంచే తమ ప్రతిభను ప్రపంచానికి చాటారు. జింబాబ్వే, నమీబియాలలో జరుగనున్న ఈ టోర్నీ యువ ప్రతిభలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కే వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

2026 అండర్–19 ప్రపంచకప్ కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆతిథ్య దేశాలు స్టేడియంలను మెరుగుపరుస్తూ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ సిద్ధమవుతున్నాయి. యువ ఆటగాళ్లకు, అభిమానులకు ఈ టోర్నీ ఒక అద్భుత అనుభవంగా నిలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గ్రూపుల వివరాలు:

గ్రూప్-ఏ: భారత్, బంగ్లాదేశ్, యూఎస్‌ఏ, న్యూజిలాండ్

గ్రూప్-బి: జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్

గ్రూప్-సి: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక

గ్రూప్-డి: టాంజానియా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా

టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే:

గ్రూప్ స్టేజ్:

* జనవరి 15: యూఎస్‌ఏ vs ఇండియా, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో

* జనవరి 15: జింబాబ్వే vs స్కాట్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 15: టాంజానియా vs వెస్టిండీస్, HP ఓవల్, విండ్‌హోక్

* జనవరి 16: పాకిస్థాన్ vs ఇంగ్లండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 16: ఆస్ట్రేలియా vs ఐర్లాండ్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్

* జనవరి 16: అఫ్గానిస్థాన్ vs దక్షిణాఫ్రికా, HP ఓవల్, విండ్‌హోక్

* జనవరి 17: ఇండియా vs బంగ్లాదేశ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో

* జనవరి 17: జపాన్ vs శ్రీలంక, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్

* జనవరి 18: న్యూజిలాండ్ vs యూఎస్‌ఏ, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో

* జనవరి 18: ఇంగ్లండ్ vs జింబాబ్వే, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 18: వెస్టిండీస్ vs అఫ్గానిస్థాన్, HP ఓవల్, విండ్‌హోక్

* జనవరి 19: పాకిస్థాన్ vs స్కాట్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 19: శ్రీలంక vs ఐర్లాండ్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్

* జనవరి 19: దక్షిణాఫ్రికా vs టాంజానియా, HP ఓవల్, విండ్‌హోక్

* జనవరి 20: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో

* జనవరి 20: ఆస్ట్రేలియా vs జపాన్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్

* జనవరి 21: ఇంగ్లండ్ vs స్కాట్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 21: అఫ్గానిస్థాన్ vs టాంజానియా, HP ఓవల్, విండ్‌హోక్

* జనవరి 22: జింబాబ్వే vs పాకిస్థాన్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 22: ఐర్లాండ్ vs జపాన్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్

* జనవరి 22: వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా, HP ఓవల్, విండ్‌హోక్

* జనవరి 23: బంగ్లాదేశ్ vs యూఎస్‌ఏ, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే

* జనవరి 23: శ్రీలంక vs ఆస్ట్రేలియా, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్

* జనవరి 24: ఇండియా vs న్యూజిలాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు సూపర్ సిక్స్

ఫిబ్రవరి 03: తొలి సెమీఫైనల్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో

ఫిబ్రవరి 04: రెండో సెమీఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే

ఫిబ్రవరి 06: ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే