పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈనెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
వచ్చే రెండు రోజుల పాటు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల అలర్ట్‌తో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న భారీ వర్షానికి తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నా.. మంచుదుప్పటిలో మునిగిన తిరుమల అందాలను ఆస్వాదిస్తున్నారు. వర్షాలతో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోయాయి. ప్రస్తుతం అక్కడ 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్డులో కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడ్డగా మరికొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. రెండో ఘాట్ రోడ్డులోని రెండో మలుపు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు, భారీ వృక్షాలు విరిగిపడడతో వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది వచ్చి తొలగించే పనిలో మునిగారు. దీని కారణంగా కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.