Chandrababu in Assembly (photo-Video Grab)

Vjy, Nov 14: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌పై నవ్వులు పూయించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ట్రిపుల్ ఆర్‌కు.. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత సంచలన నమోదు చేసుకుందో.. రాజకీయంగా మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిందన్నారు. ఈ చిత్రంలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో.. ట్రిపుల్ ఆర్ రచ్చబండ అంత పాపులర్ అయ్యిందని గుర్తు చేశారు.

తాను జైల్లో ఉన్న సమయంలో.. తన రూంలో సీసీ టీవీలు పెట్టి రిమోట్ ద్వారా చూడాలనుకున్నారన్నారు. అయితే గతంలో రఘురామరాజు విషయంలో ఆయన్ను కొడుతూ వీడియో కాల్‌లో చూసారన్నప్పుడు అలా జరుగుతుందా? అని అనుకున్నానని చెప్పారు. కానీ తనకు అదే జరిగే సరికి నమ్మాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా? అని పరిశీలిస్తే.. ఇటువంటి వ్యక్తి కొలంబియాలో ఉన్నాడని తెలిసిందని.. అతడి పేరు ప్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పారు.

వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

గడచిన ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. గత ఐదేళ్లలో పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.

1995 కంటే ముందు లైసెన్స్‌ రాజ్‌ కారణంగా పెట్టుబడులు రాలేదు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగామన్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమే కారణం. 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌ దేశంగా తయారైతే ఏపీ కూడా దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా ఉండాలనే ఈ పాలసీలు తీసుకొచ్చాం. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రాధాన్యత. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా విధానం మార్చుకున్నాం. ఉత్పత్తి వ్యయం తగ్గించటం, బ్రాండ్.. ఇలా అన్ని అంశాల్లోనూ దృష్టి పెట్టాం.

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చాలన్నది మా విధానం. ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీని.. అన్ని రాష్ట్రాల విధానాల్ని అధ్యయనం చేసి రూపొందించాం. ఏ విధానమైనా 2024-29 వరకూ అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. 175 నియోజకవర్గాల్లో ప్రతీ చోటా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని సీఎం తెలిపారు.