సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ(56 బంతుల్లో 107 నాటౌట్, 8ఫోర్లు, 7సిక్స్‌లు) శతకానికి తోడు అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించింది.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 208/7 పరుగులు చేసింది. జాన్సెన్(17 బంతుల్లో 54, 4ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా..జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు.దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నవంబర్ 15న జొహన్నెస్‌బర్గ్ వేదికగా నాలుగవ టీ20 మ్యాచ్ జరగనుంది.
తాజాగా టీమిండియా మరో రికార్డును సొంతం చేసుకుంది. విదేశాల్లో 100వ టీ20 గెలుపుని అందుకుంది. విదేశీ గడ్డపై 100 టీ20 విజయాలు సాధించిన రెండవ జట్టుగా భారత్ అవతరించింది. టీమిండియా విదేశాల్లో మొత్తం 152 టీ20 మ్యాచ్‌లు ఆడి 100 విజయాలు సాధించింది. 43 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
కాగా ఈ జాబితాలో దాయాది దేశం పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ విదేశీ గడ్డపై 116 విజయాలు సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. 84 విజయాలతో ఆఫ్ఘనిస్థాన్ మూడవ స్థానంలో ఉంది. ఆ జట్టు విదేశాల్లో 138 టీ20లు ఆడి 84 విజయాలు అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్ సొంతగడ్డపై తక్కువ మ్యాచ్‌లు ఆడుతుంటుంది కాబట్టి మూడవ స్థానంలో నిలవగలిగింది. అగ్రశ్రేణి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా విదేశాల్లో 137 టీ20 మ్యాచ్‌లు ఆడి 71 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ విదేశాల్లో 129 మ్యాచ్‌లు ఆడి 67 గెలుపులు సాధించి ఐదవ స్థానంలో ఉంది.