YSR Arogya Aasara: పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, శస్త్రచికిత్స తరువాత విశ్రాంత సమయంలో రోజుకు రూ. 225, గుంటూరులో అధికారికంగా ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, పథకం ద్వారా నాలుగున్నర లక్షల మందికి లబ్ధి
ఆరోగ్యశ్రీ పథకం(YSR Arogya Sri)లో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా(YSR Arogya Aasara Scheme) పథకాన్ని గుంటూరు (Guntur) జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు.
Amaravathi, December 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకం(YSR Arogya Sri)లో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా(YSR Arogya Aasara Scheme) పథకాన్ని గుంటూరు (Guntur) జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు.
శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. మూడు నెలలపాటు ఐదువేల చొప్పున దీన్ని అందించనున్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి (AP CM YS Jagan) చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమంగా చెప్పవచ్చు.
కుటుంబ పెద్ద జబ్బు పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ‍్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే జారీచేసింది. రోగి డిశ్చార్జి అయ్యే సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ఏటా రూ.270 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.