Amaravathi, November 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో 2019 - 20 (AP Assembly-2019-2020) సంవత్సరానికి బడ్జెట్(AP Budget-2019)ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ విదితమే. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) రూ.2.27లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమానికి పెద్దపీట వేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలకు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు బీమా అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పలు పథకాలకు పెట్టారు.
అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుతో రెండు పథకాలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి ‘జగనన్న అమ్మ ఒడి కాగా రెండవది జగనన్న విద్యా దీవెన. ఈ పథకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జగననన్ విద్యా దీవెన గురించి ఓ సారి తెలుసుకుందాం.
వైయస్సార్ నవశకం (YSR Navasakam) కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యాదీవెన పథకం (Jagananna Vidya Devena Scheme) కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (ఆర్‌టీఎఫ్) వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యార్థికీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.20 వేలు ఇస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బోర్డు గుర్తింపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.
ఈ పథకాలకు అర్హత పొందాలంటే కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. పదెకరాల మాగాణి లేదా 25 ఎకరాల్లో మెట్ట భూమి ఉండవచ్చు. మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలకు మించకూడదు. పారిశుద్ధ్య కార్మికులు మినహా మరే ఒక్క కుటుంబసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండకూడదు.
టాక్సీ, ఆటో, ట్రాక్టరు వంటివి తప్ప మరే సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండకూడదు. పట్టణాల్లో 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు. ఈ అర్హతలు ఉంటే జగనన్న విద్యా దీవెనకు అర్హులవుతారు.