Amaravathi,October 18: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ నవోదయం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాలను గుర్తించారు. రూ.4వేల కోట్ల రుణాలను వన్‌టైమ్ రీస్ట్రక్చర్ చేయనున్నారు. ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా దీని ద్వారా చర్యలు చేపట్టనున్నారు.
దీంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం కలగనుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు.
వైయస్సార్ నవోదయం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి: వైయస్సార్ నవోదయం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు. pic.twitter.com/auFlVp4EpN
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 17, 2019
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దాదాపు 80,000 యూనిట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతాయని తెలుస్తోంది. లక్షల మందికి ఉపాధిని కల్పించే ఎంఎస్ఎంఈ లను ఆదుకోవటానికి ఈ పథకం ప్రారంభించినట్లు తెలుస్తోంది. 10 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు ఆర్థిక తోడ్పాటు అందించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్థిక మాంద్యం, జీఎస్టీ, నోట్ల రద్దు వలన చిన్న తరహా పరిశ్రమలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పథకం ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీ షెడ్యూల్ చేస్తారని తెలుస్తోంది. 2020 మార్చి నెల 31వ తేదీ లోపు ఎంఎస్ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చే విధంగా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో పాటుగా రిజర్వ్ బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేసే నాటికి జీఎస్టీ రిజిస్టేషన్ కూడా పూర్తి చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈరోజు ఇళ్ల స్థలాల పంపిణీ గురించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు సీఎం జగన్ ఇళ్ల స్థలాల పంపిణీ గురించి ముఖ్యమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.