Amaravathi, November 19: నవరత్నాల అమలు(government’s Navaratnalu programme)లో భాగంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ నవశకం (YSR Navasakam) సర్వే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం (AP Government) శ్రీకారం చుట్టింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో అదే రోజు గ్రామ సభలు నిర్వహిస్తారని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం విజయవాడ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు (KannaBabu)తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రామ వార్డు వాలంటీర్లు హౌస్ హోల్డ్ క్లస్టర్ల వారీగా డేటాను మ్యాపింగ్ చేయాలని తెలిపారు. తరువాత ఎంపిడిఒ, మున్సిపల్ కమిషనర్ల స్థాయిలో డేటాను ధ్రువీకరించాలని, అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో డేటాను ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు.
ఆ తరువాత ప్రీ పాపులేటెడ్ సర్వే పార్మాట్ పిడిఎఫ్ రూపంలో జిల్లాలకు పంపిస్తామని చెప్పారు. ఆ ఫార్మాట్‌లను జిల్లా స్థాయిలో ప్రింటింగ్ చేసుకొని సర్వే చేయాలని తెలిపారు. 20న ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు.జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఈ నెల 20న కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆర్‌టిజిఎస్ తరుపున జిల్లాల వారిగా నిపుణుల సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు.
ప్రతి ఇంటి గడప వద్దకు పాలన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ నవశకం ప్రవేశ పెట్టింది. నవశకం నియమావళిని ఖచ్చితంగా అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఇప్పటికే ప్రభుత్వం దిశానిర్ధేశం చేసింది. గ్రామ పంచాయతీల వద్ద గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్డులను పంపిణీ చేయనున్నారు. వైఎస్‌ఆర్ నవశకంలో లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే (door-to-door survey programme) నిర్వహిస్తారు. ఐదు రకాలైన కార్డుల జారీ, ఏడు పథకాల అమలు నవశకం ముఖ్య ఉద్దేశం. ఇందు కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయనున్నారు.
సన్న బియ్యం, వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమాల్లో కార్డులను ప్రత్యేకంగా అందజేసేందుకు వాలంటీర్లు సర్వే చేస్తారు. అలాగే వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న భరోసా, గీతన్న నేస్తం, అమ్మఒడి, వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకంలో అర్హుల ఎంపిక, అనర్హుల పేర్లను నివేదికగా వాలంటీర్లు అందజేస్తారు.
వాలంటీర్లు లేని చోట్ల పొరుగున ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లను ఇన్‌ఛార్జులుగా నియమించి వారితో సర్వే చేయిస్తారు. అది పూర్తయిన తర్వాత డిసెంబరు 1న డేటాను కంప్యూటరీకరిస్తారు. అర్హులతో పాటు అనర్హుల జాబితాను డిసెంబరు 2 నుంచి 7వ తేదీల్లో ప్రకటిస్తారన్నారు. 11, 12 తేదీల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి 15-18 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి 19న ఫైనల్ లిస్ట్‌ని ప్రకటిస్తారు.
అమ్మఒడి పథకంలో దరఖాస్తు చేసుకునే పిల్లల తల్లులకు విధిగా ఆధార్ కార్డు ఉండాలని, ఛైల్డ్ ఇన్ఫోలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దర్జీలు, రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహకారం అందజేసేలా బీసీ సంక్షేమ శాఖ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నందున దరఖాస్తు చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్ కాపు నేస్తంలో 45 సంవత్సరాలు నిండిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తారు.
బీసీలు, కాపు వర్గంలో నాలుగు విభాగాల వారికి ప్రతిఏటా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వైఎస్‌ఆర్ నవశకం కింద టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులకు ప్రతి ఏటా రూ.10వేలు వంతున ఐదేళ్ళలో రూ.50వేలు అందజేయాలని నిర్ణయించారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి విభాగాల వారికి ఏటా రూ.15వేలు వంతున ఐదేళ్లలో రూ.75వేలు లబ్ధిచేకూర్చాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థికసాయం వచ్చే ఏడాది మార్చి నుంచి అందనుంది. బీసీల్లో ఆర్థికంగా వెనుకబడిన రజకులు నాయీబ్రాహ్మణులు, టైలరు వృత్తితో జీవించే వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను ఆయా వృత్తులు వారికి ఏటా రూ.10వేలు వంతున ఐదేళ్ల పాటు రూ.50వేలు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పథకానికి అర్హతలు
ఈ పథకం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి, విభాగాలకు చెంది 45ఏళ్ళు పైబడిన మహిళలు అర్హులుగా నిర్ణయించారు. ఈ పథకానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం ఉన్నవారు మాత్రమే అర్హులు. మూడు ఎకరాలు మాగాణి లేక 9ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. 750 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇల్లు కలిగి ఉన్నవారు అర్హులు. 45 నుంచి 60 ఏళ్లులోపు వయసు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఎస్‌ఎస్‌సీ మార్కులు జాబితాలోని పుట్టినతేదీ, ఓటరు గుర్తింపు కార్డులను వయస్సు ధ్రువీకరణకు పరిగణనలోకి తీసుకుంటారు. లబ్ధిదారులు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.15వేలు వారి ఖాతాలో వేసి ఫోన్లకు సందేశం పంపుతారు.