Hyd,Nov 28: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఖండించింది. సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుంది. కలెక్టర్ విధులను వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.
సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేసింది. ఓ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరశంఖం, గురుకుల బాటకు పిలుపునిచ్చిన కేటీఆర్
కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. బీఆర్‌ఎస్ నాయకులను పార్టీ మారాలని చెబుతున్నారట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడి కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నాడని.. మా పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడట.. ఇలాంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని.. వీళ్లు టీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని.. అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తామని.. ఆ బాధ్యత తానే తీసుకుంటానన్నారు. ఖచ్చితంగా ఆ పని చేసి చూపిస్తామన్నారు.