Cyclone Fengal LIVE: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో దాదాపు స్థిరంగా ఉందని, ఇది మరో 12 గంటల్లో ఫెంగల్ తుఫానుగా మారుతుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను తీవ్రరూపం దాల్చడంతో తమిళనాడు తీర ప్రాంతాలకు ముప్పు వాటిల్లడంతో భారత నౌకాదళం సమగ్ర విపత్తు ప్రతిస్పందన ప్రణాళికను రెడీ చేసింది.
నవంబర్ 30 నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా మారనుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఐఎండీ తెలిపింది.అన్నీ అనుకూలిస్తే రేపు ఉదయానికి ఇది తుఫానుగా బలపడనుంది.
RMC చెన్నై ప్రకారం, అతి భారీ వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇది కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం మరియు కడలూరు జిల్లాలు, పుదుచ్చేరిలోని పలు ప్రదేశాలను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబలూరు, అరియలూరు, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
భారతీయ తీర రక్షక దళం తమ నౌకలు, విమానాలు, రాడార్ స్టేషన్లు ఫిషింగ్ బోట్‌లను నౌకాశ్రయానికి తిరిగి రావడానికి సలహాలను జారీ చేశాయని పేర్కొంది. విపత్తును ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని సూచించింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉదయం 8:30 గంటలకు, అల్పపీడనం త్రికోణమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ, పుదుచ్చేరికి 710 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, చెన్నైకి 800 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా ఉందని నివేదించింది.
ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, నవంబర్ 28న తుఫానుగా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదులుతూ, తదుపరి రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటుతుందని IMD తెలిపింది.ఈ సమయంలో తీరప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో రాత్రికిరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నిలిచిన వరి పంటలు దెబ్బతిన్నాయి. డెల్టా ప్రాంతంలో భాగమైన కడలూరు, మైలదుత్తురై జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.తిరువారూర్, తిరుతురైపూండి, ముత్తుపేటై, మైలదుత్తురై, వేదారణ్యం సహా పలు ప్రాంతాల్లో వర్షాల వల్ల పంటలు నీట మునిగాయి, కనీసం 2,000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని రైతులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా తిరువారూర్, కడలూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు నవంబర్ 28న సెలవు ప్రకటించారు. చెన్నై, చెంగెల్‌పేట, అరియలూరు, కాంచీపురంలోని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
ఏపీలో ఆ జిల్ల హై అలర్ట్
ఫెంగల్ తుపాను కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తుర వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి తీవ్ర భారీ వర్షసూచన ఉంది. ఫెంగల్ తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. నవంబర్ 3వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల , పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు.