New Delhi, NOV 22: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తన యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తోంది. చాలా మంది యూజర్లు సుదీర్ఘ విషయం చెప్పడానికి వాయిస్ మెసేజ్ ఫీచర్ (Whatsapp Voice Message ) వినియోగిస్తారు. ఈ వాయిస్ మెసేజ్‌ని నలుగురి మధ్యలో ఉన్నప్పుడు వినడం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటప్పుడు వినాలంటే ఇయర్ ఫోన్స్ ఉండాలి. అలా వీలు కాకుంటే సదరు వాయిస్ మెసేజ్ వదిలేయాల్సి ఉంటది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. వాయిస్ మెసేజ్.. టెక్ట్స్ రూపంలో చదువుకోవడానికి వీలుగా వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ (Voice Message Transcripts) ఫీచర్ తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్ వినొచ్చు.. వినలేని పరిస్థితుల్లో ట్రాన్స్‌స్క్రిప్ట్ (Transcripts) చేసుకుని టెక్ట్స్ రూపంలో చదువు కోవచ్చు. అలాగని అది ట్రాన్స్ లేటర్ కానేకాదు. వాయిస్ మెసేజ్ ఉన్న భాషలోనే టెక్ట్స్ వస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే వాయిస్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా కింద టెక్ట్స్ రూపం లభిస్తుంది. కేవలం మెసేజ్ అందుకున్న వారు మాత్రమే టెక్ట్స్ చూడగలరు తప్ప.. పంపిన వారు అలా టెక్ట్స్ మెసేజ్ కోసం ఈ ఫీచర్ వినియోగించలేరని వాట్సాప్ తెలిపింది.
ఆండ్రాయిడ్ వర్షన్‌లో ఇంగ్లీష్ తోపాటు పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలకు వాయిస్ మెసేజ్ ఫీచర్ మద్దతుగా ఉంటుంది. ఇక ఆపిల్ ఐఓఎస్ యూజర్లకు అదనంగా అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ భాషల్లో ఈ ఫీచర్ అందుబాటుటో ఉంటుంది. మున్ముందు ఇతర భాషల్లోకి విస్తరించనున్నది. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవడానికి వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో కనిపించే వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఆప్షన్ ఆన్ / ఆఫ్ చేసుకోవడంతోపాటు భాషను కూడా ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యూజర్లకు సపోర్ట్ లేని భాష, పదాలను గుర్తించలేకపోతే ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఎర్రర్ వస్తుందని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ రోల్ ఔట్ చేసిన ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది.