New Delhi, DEC 26: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ (Union Budget) ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్‌లో వేతన జీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ ప్రతి ఒక్కరూ ఆదాయం పన్నులో మార్పులూ చేర్పులూ ఉంటాయా? అన్న కోణంలో చూస్తూ ఉంటారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపు దారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. పట్టణాల్లో నివసించే వారికి రూ.15 లక్షల వరకూ పన్ను పరిధి నుంచి మినహాయింపు (Cutting Income Tax) ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా మధ్య తరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతోపాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంటి అద్దెలు, పొదుపు పథకాల్లో మదుపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ 2020లో తీసుకొచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి.
కొత్త ఆదాయం పన్ను విధానంలో రూ.3-15 లక్షల్లోపు ఆదాయం కల వారిపై 5-20 శాతం మధ్య పన్ను విధిస్తారు. అంత కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. రూ.3 లక్షల ఆదాయం వరకూ పన్ను రాయితీ, రూ.3-7 లక్షల్లోపు ఆదాయం కల వారు ఐదు శాతం, రూ. 7-10 లక్షల్లోపు 10 శాతం, రూ.10-12 లక్షల్లోపు ఆదాయం గల వారు 15 శాతం, రూ.12-15 లక్షల్లోపు ఆదాయం కల వారు 20 శాతం, రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం కల వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
భారత పన్ను చెల్లింపు దారులు రెండు వేర్వేరు ఆదాయం పన్ను విధానాల్లో తమకు ఇష్టమైన దాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. వారసత్వంగా వస్తున్న పాత ఆదాయం పన్ను విధానం ద్వారా ఇంటి అద్దెలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, నేషనల్ సేవింగ్స్ వంటి పొదుపు పథకాల్లో మదుపు, సొంతింటి రుణంపై వడ్డీ చెల్లింపు తదితర అంశాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 2020లో తీసుకొచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నా ప్రధాన మినహాయింపులకు అనుమతించడం లేదు. పన్ను తగ్గింపుతో చాలా మంది నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు.
ఎంత మేరకు ప్రభుత్వం మినహాయింపునిస్తుందన్న సంగతి ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించిన తర్వాత తెలుస్తుంది. రూ.10 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. అధిక ధరలతోపాటు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచక పోవడంతో మధ్య తరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ఇంటింటి బడ్జెట్లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో మధ్య తరగతి ప్రజల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నది.