Vjy, Dec 27: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.
ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నాడు మోస్తరు వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌లో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. పని మీద బయటకు వచ్చినవారు, ఇంటికి వెళుతున్న వారు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.సికింద్రాబాద్, తిరుమలగిరి, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బోరబండ, కూకట్‌పల్లి, కోఠి, హబ్సిగూడ, తార్నాక, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిపడుతున్నారు.
ఆకాశం మేఘావృతమవుతుందని, పొగమంచు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వెలువరించింది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.