Weather Forecast (photo-ANI)

Vjy, Dec 27: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కి.మీ. మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరువలో ఉందని వివరించింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వచ్చే 24 గంటలు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. రానున్న రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే సమయంలో రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, అల్పపీడనం బలహీనపడినప్పటికీ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది.హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.