Dry Day Woes: మద్యం కోసం తహతహలాడి రూ. 51 వేలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ మహిళ, కేసు నమోదు చేసిన పోలీసులు
శనివారం రోజు అంతా కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నారు. అయితే అయోధ్య తీర్పు నేపథ్యంలో పుణె జిల్లా కలెక్టర్ రెండు రోజుల పాటు 'డ్రై డే.....
Pune: మద్యం మత్తులో డబ్బు పోగోట్టుకునే ఉదంతాలు చాలా చూసుంటాం, కానీ మద్యం తాగకుండానే ఒక మహిళకు దిమ్మతిరిగే కిక్కేకించాడు ఓ ఆన్ లైన్ మోసగాడు. అందులోనూ మోసపోయిన ఆ బాధిత మహిళ ఉన్నత చదువులు చదివిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software Employee) కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే, కోల్‌కతా చెందిన 32 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిషా (పేరు మార్చాం) నాలుగు రోజుల కోసం పుణెలో తన స్నేహితులను కలవటానికి వెళ్లింది. శనివారం రోజు అంతా కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నారు. అయితే అయోధ్య తీర్పు నేపథ్యంలో పుణె జిల్లా కలెక్టర్ రెండు రోజుల పాటు 'డ్రై డే' (Dry Day)గా ప్రకటించారు. దీంతో మద్యం షాపు (Wine Shops)లన్నీ మూసివేయబడ్డాయి. అయితే ఎలాగైనా సరే మద్యం తాగితీరాల్సిందేనని తహతహలాడిన నిషా ఆన్‌లైన్‌లో మద్యం కోసం సెర్చ్ చేయగా ఒక ఫోన్ నెంబర్ కనిపించింది. దీంతో వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేసి మద్యం కావాల్సిందిగా కోరింది. అందుకు అవతలి వ్యక్తి, ఈరోజు డ్రై డే వైన్ షాప్ మూసివేశాం అయితే డబ్బు ఎక్కువ చెల్లిస్తే డెలివరీ చేస్తాం అని చెప్పాడు, ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఆమె మొబైల్‌కు ఒక లింక్ పంపించాడు.
ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ సెక్షన్‌కు వెళ్లగానే నిషా ముబైల్‌కు ఓటీపీ నెంబర్ వచ్చింది. దీంతో ఓటీపీ చెప్పమని అవతలి వ్యక్తి కోరగా, అమాయకంగా చెప్పేయడంతో క్షణాల్లోనే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 31,777 డిబేట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసి వెంటనే ఆ అగంతకుడికి ఫోన్ చేసి విషయం తెలపగా, ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పిన అతగాడు, ఆ డబ్బు రిటర్న్ క్రెడిట్ అవుతుంది మరోసారి ప్రయత్నించండి అని నమ్మబలికాడు. అలా రెండోసారి వచ్చిన ఓటీపీని కూడా చెప్పేసింది. ఇక రెండో సారి రూ. 19,001 విత్ డ్రా చేశాడు. ఈ దెబ్బతో ఆమె ఖాతాలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖాళీ అయింది. షాక్ తిన్న నిషా అతడికి తిరిగి ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు మోసపోయానని గ్రహించిన బాధితురాలు, స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గిర్రున తిరిగిన మీటర్, రూ. 4,300 ఛార్జి, షాక్ తిన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఇక ఇంత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసేవారు కూడా ఇంత సులభంగా మోసపోతారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె దాహం ఖరీదైనది, 50 వేలకు ఎన్ని బీర్లు వస్తాయి? మద్యపానం బ్యాంకు ఖాతాలకు హానికరం, డ్రై డే ఆమె బ్యాంకు ఖాతాను డ్రై చేసింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.