KTR-Women's Commission: మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు
కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.
Hyderabad, Aug 16: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ (Free Bus) ప్రయాణ సదుపాయంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మహిళలపై చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది. కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కూడా మండిపడ్డారు. కాగా, మహిళలపై తాను యథాలాపంగా చేసిన మాటలకు క్షమాపణలు చెప్తున్నట్టు కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కేటీఆర్ ఏమన్నారంటే...?
‘నిన్న మా సీతక్క చెబుతోంది... బస్సులో అల్లం ఎల్లిపాయ ఏరితే తప్పా అని!... తప్పని మేమెక్కడ అన్నాం అక్కా... మేం అనలేదు... కాకపోతే దాని కోసమే బస్సు పెట్టారని మాకు తెలియక ఇన్నాళ్లు మేం మామూలుగా నడిపాం. మాకేమో తెలియకపాయే. మీరు అప్పుడే చెబితే బాగుండు. బస్సులో కుట్లు-అల్లికలు చేస్తే తప్పా? అని అడుగుతున్నారు. తప్పని మేం ఎందుకు అంటాం అక్కా... కానీ ఇంకా ఎక్కువ బస్సులు పెట్టు. సీట్ల కోసం తన్నుకుంటున్నారు... మనిషికో బస్సు పెట్టు. మేం ఎందుకు వద్దంటాం. మనిషికో బస్సు పెట్టు... కుటుంబం కుటుంబం అంతా పోయి అందులో కూర్చొని కుట్లు - అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు... రికార్డింగ్... ఏం చేస్తారో చేయండి.. మేం ఎందుకు వద్దాంటాం’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.