ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందన్నారు. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టే ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాం అన్నారు కృతికా శుక్లా.
ఏపీ SBTET డిప్లొమా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను sbtet.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘‘చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తాం. 2024-25 నుంచి పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుంది.
15 రాష్ట్రాల్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం.ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలి. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచాం’’ అని కృతికా శుక్లా తెలిపారు.