Vjy, Jan 8: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ (PM Modi) అని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
‘‘ఏపీలో ఎన్డీఏ కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించింది. భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతుంది, దేశ రాజకీయాల్లో మోదీ ప్రధానిగా ఉంటారు. దిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుంది.. రాసి పెట్టుకోండి. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన.. మోదీ నినాదాలు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకిన్ ఇండియా తెచ్చారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, గతిశక్తి తెచ్చారు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబయి ఎలా ఉందో.. ఏపీకి విశాఖ అలాంటి ఆర్థిక నగరం’’ అని చంద్రబాబు వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రోడ్ షో వీడియో ఇదిగో, పూల వర్షం కురిపించిన ప్రజలు
రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో రూ.1,877 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నంలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. వీటికి రూ.6,177 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. రూ.5,718 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులు నేడు ప్రారంభం చేస్తున్నాం. విశాఖ రైల్వేజోన్ కల సాకారమైంది. విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు ఇచ్చి నగరవాసుల చిరకాల కలైన విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాం. ఏపీ చరిత్రలోనే ఇది నిలిచిపోయే రోజు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వేళ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తి మోదీ. 7 మండలాలను రాష్ట్రంలో విలీనం చేసిన వ్యక్తి మోదీ. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతాం. ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎయిమ్, ట్రైబల్, సెంట్రల్ వర్సిటీలతోపాటు 12 యూనివర్సిటీలు ఏపీకి కేటాయించారు. కేంద్రం సాయంతో నిలదొక్కుకుని ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. కష్టాలు, సమస్యలను అధిగమించి ముందుకెళ్తాం. కేంద్రం సాయంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకుంటున్నాం.
ప్రధాని మోదీ నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతుంటా. అమరావతి నిర్మాణంలో మోదీ సహకారం కావాలి. అమరావతిని త్వరలో పూర్తి చేస్తాం. మోదీ సారథ్యంలోనే పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. భవిష్యత్‌లోనూ మా కూటమి కొనసాగుతుంది. ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీఏనే. మేమంతా మోదీతోనే ఉంటాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తి ఆయన. మా కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది. ప్రధానిగా మోదీ ఉంటారు. ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ. దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ" అని చెప్పారు.
మోదీని స్ఫూర్తిగా తీసుకొని నిత్యం ముందుకెళ్తాం. త్వరలో అమరావతికి రావాలని ప్రధానిని కోరుతున్నా. నదుల అనుసంధానం మా లక్ష్యం.. అందుకు కేంద్రం సాయం కావాలి. మోదీ కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో ఉంటాం. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేంద్రం సాయంతో నిలదొక్కుకున్నాం.. ముందుకెళ్తున్నాం. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసే బాధ్యత మాది. కేంద్రం అండతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి.
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి.. కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. కొప్పర్తి, ఓర్వకల్లు.. పారిశ్రామిక ప్రాంతాలుగా మారుతున్నాయి. అరకు కాఫీని మోదీ బాగా ప్రచారం చేస్తున్నారు. ఏ సమస్య చెప్పినా ఆయన వెంటనే అర్థం చేసుకుంటారు. వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా చొరవ చూపలేదు. మన దేశానికి సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారు’’ అని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, టీజీ భరత్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.