PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 85 వేల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ 57 వేల మందికి ఉపాధి కలగనుంది. అనకాపల్లి జిల్లా పుడిమడకలో 1200 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరిగింది. రెండు వేల ఎకరాల్లో రూ.1876 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. 17 రాష్ట్రాలు పోటీ పడగా దక్షిణ భారతదేశం నుంచి ప్రాజెక్టు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 10 నుంచి 15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనుంది. దీంతో పాటు రైల్వే జోన్ భవనాలకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు.
ప్రధాని మోదీ విశాఖలో మాట్లాడుతూ.. తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ.. ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్ కొట్టారని పేర్కొన్నారు. 60 ఏళ్ల తర్వాత దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.