New Delhi, Jan 15: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. మండే ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్షీణించలేదు. 2023 ఫిబ్రవరి 6న రూపాయి డాలర్‌తో పోలిస్తే 68 పైసలు పతనమైంది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో పడిపోయింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపీ వాల్యూ 86.70 స్థాయికి చేరి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది.
గత కొద్ది రోజుల నుంచి భారతీయ కరెన్సీ డాలర్ ముందు నిలదొక్కుకోలేక పతనమైపోతోంది. అమెరికా మార్కెట్లో అంచనాల్ని మించి ఉద్యోగ వృద్ధి నమోదవడం.. డాలర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ను తెచ్చిపెట్టిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత వాతావరణం నెలకొనడంతో ఈ రూపాయి నష్టం దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బేనని చెబుతున్నారు. అది ద్రవ్యోల్బణం విజృంభణకు దారి తీయవచ్చని చెబుతున్నారు. రూపాయి పతనం రాజకీయంగానూ ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. అధికార బీజేపీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థిరంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి ఒకటని అంటుండగా, కాంగ్రెస్ మాత్రం మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శలు చేస్తోంది.