Hyd, January 12: సంక్రాంతి రేసులో వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరీ ఆ అంచనాలను బాబీ నిలబెట్టాడా లేదా చూద్దాం.
కథ:
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)విద్యావేత్త. సచిన్‌కు చెందిన కాఫీ ఎస్టేట్‌ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) అక్కడ వన్యమృగాలని అక్రమంగా తరలిస్తుంటాడు. విషయం తెలిసి పోలీసులని ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు,, కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. వీరిని కాపాడటానికి మోస్ట్ వాంటెడ్ మహారాజ్ (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది?, విలన్ బారీ నుండి వారిని హీరో ఎలా కాపాడాడు?,చివరకు కథ ఎలా సుఖాంతం అయిందనేదే డాకు మహారాజ్ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ బాలయ్య నటన, కథ, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ సంగీతం. తనకు అచ్చొచ్చిన యాక్షన్ పాత్రలో ఇరగదీశాడు బాలయ్య. ముఖ్యంగా డిఫరెంట్ పాత్రలో బాలయ్య మెప్పించాడు. ప్రగ్యా జైస్వాల్ ,శ్రద్ధా శ్రీనాథ్ సినిమాకు మంచి గ్లామర్ తీసుకొచ్చారు. ఊర్వశి రౌతేలా పాటలో అదరగొట్టింది. మకరంద్ దేశ్ పాండే , సచిన్ ఖేడ్కర్, చాందిని చౌదరి, రవి కిషన్, మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
బ్యాక్ డ్రాప్, కథ రొటీన్ గా ఉంటుంది. క్లైమాక్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ ని సెకండ్ హాఫ్ కే పరిమితం చేయడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చదు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. ముఖ్యంగా తమన్ సంగీతం పూనకాలు తెప్పించడం ఖాయం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో తమన్ బీజీఎం దద్దరిల్లాల్సిందే. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)
తీర్పు:
చెడుపై పోరాడే ఓ హీరో కథే డాకు మహారాజ్. స్క్రీన్ ప్లే, యాక్షన్ లో చూపించిన వైవిధ్యం డాకు మహారాజ్ కి కొత్తదనం వచ్చింది. యాక్షన్ ని కొత్తగా చూడాలనుకునే వారికి నచ్చే సినిమా డాకు మహారాజ్.
విడుదల తేదీ:12/01/2025
రేటింగ్:3/5
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్
నిర్మాత: నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: తమన్
దర్శకత్వం: బాబీ